Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగులు బడ్జెట్ నుంచి చెల్లింపులు..?
- రాష్ట్ర సర్కారు ఆదేశం
- నిజామాబాద్ జిల్లాలో రూ.35 కోట్ల బిల్లులు
- సర్పంచుల విస్మయం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిధుల కోసం కొట్టుమిట్టాడుతున్న పంచాయతీ లపై సర్కారు మరో భారం మోపింది. 2019 నుంచి పెండింగ్‌లో ఉన్న విద్యుత్ పాత బకాయిలను (ట్రూ ఆప్ చార్జీలు) చెల్లించాలని ఆదేశించింది. చిన్న, పెద్ద పంచాయతీ అన్న తేడా లేకుండా ఆయా పంచాయతీల ఆర్థిక స్థాయిని బట్టి మొత్తం చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. ఈ బాధ్యతను కలెక్టర్లపై నెట్టింది. దాంతో పంచాయతీలతో బిల్లులు చెల్లింపచేసే బాధ్యత కలెక్టర్లపై పడింది. ఇప్పటికే పలుమార్లు ఈ విషయమై సమావేశాలు జరిగాయి. కాగా ప్రభుత్వ నిర్ణయంపై సర్పంచులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లోని మిగులు నిధులను కాజేయాలని సర్కారు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 530 పంచాయతీలున్నాయి. రాష్ట్ర సర్కారు పల్లె ప్రగతి పనులు ప్రారంభించే సమయంలో పంచాయతీలు సైతం విధిగా విద్యుత్తు బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. గతంలో ఉన్న పాత బకాయిలను వన్‌టైం సెటిల్మెంట్ చేసింది. నాటి నుంచి డిస్కములు ఆయా పంచాయతీలకు సంబంధించిన బిల్లులను నేరుగా ఆన్లైన్ ద్వారా పంచాయతీలకు పంపుతున్నాయి. అదే సమయంలో విద్యుత్తు బిల్లుల్లో నీటికి సంబంధించిన మోటారు బిల్లులను కూడా జత చేసింది. అయితే ఆ సమయంలో పంచాయతీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అధికార పార్టీకి చెందిన సర్పంచులు సైతం ఈ విధానాన్ని వ్యతిరేకించారు. కొత్త పంచాయతీల పాలకవర్గాలు కొలువు దీరిన తర్వాత నెలల తరబడి నిధులు విడుదల చేయలేదు. సర్పంచులు సైతం జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దాంతో సర్కారు కొంత వెనక్కి తగ్గి విద్యుత్తు బిల్లుల్లో 10 శాతం చెల్లించాలని వెసులుబాటు కల్పించింది. కానీ ప్రస్తుతం 2019 మార్చి నుంచి మిగిలిన 90 శాతం బిల్లులను చెల్లించాలని ఆదేశించింది. ఆదేశించడమే కాకుండా తప్పకుండా చెల్లించేలా ఆ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. నిజామాబాద్ జిల్లాలో పంచాయతీల నుంచి మొత్తం రూ.37 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని డిస్క్మ్లు తమ నివేదికల్లో పొందుపరిచాయి. అందులో సర్ఛార్జితో పాటు ఇతర ఛార్జీలను కూడా జత చేశారు. అయితే దీనిపై పంచాయతీ అధికారులు కూర్చొని అదనపు వడ్డింపులను తొలగించగా.. చివరకు రూ.35 కోట్లు చెల్లించాల్సిందిగా తేల్చారు. ప్రస్తుతం 530 పంచాయతీలు రూ.35 కోట్లు చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే ఏంటి.. అనే అంశంపై స్పష్టత రాలేదు. అయితే పంచాయతీల్లో ఉన్న మిగులు నిధుల నుంచి వీలైనంత కట్టించాలని పంచాయతీ అధికారుల నుంచి గ్రామ కార్యదర్శులు, సర్పంచులను ఒత్తిడి చేస్తున్నారు. పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనకు ఉన్న బడ్జెట్ నుంచి రాష్ట్ర సర్కారు విద్యుత్తు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేయడం సరికాదని వాపోతున్నారు. ఇప్పటికే చాలా పంచాయతీలు అప్పుల్లో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖాతాలో జమ ఉంచడం పాపమా...
మూడేండ్ల కిందట గత పాలకవర్గం హయాంలో ఉన్న పాత విద్యుత్ బకాయిల పేరుతో ప్రస్తుతం గ్రామపంచాయతీ ఖాతాలో జమ ఉన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయించడం సరైన పద్ధతి కాదు. ముందస్తు అవసరాల కోసం జీపీ ఖాతాల్లో జమ ఉన్న నిధులను ఇలా చేస్తే పంచాయతీల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలో అర్థం కావడం లేదు.
- ద్యాగ సరీన్, నాళేశ్వర్ సర్పంచ్, నవీపేట్ మండలం