Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్ధిపేట సిటీబ్యూరో
మల్ల యుద్ధం పోటీలో పాతబస్తీకి చెందిన ఓ. దుర్గేశ్ కుమార్ ప్రతిష్టాత్మక బాలకేసరి అవార్డును గెలుపొందారు. పాత బస్తీలోని ధూల్‌పేట్‌లో గల ప్లేగ్రౌండ్‌లో ఆదివారం రాత్రి జరిగిన హోరాహోరి పోటీల్లో దాదాపు 29 మంది పహిల్వాన్ లను మట్టికరిపించిన దుర్గేశ్.. చివరికి బాలకేసరి అవార్డును కైవసం చేసుకున్నాడు. జై వీర హను మాన్ కేసరి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ సంస్థ ఆధ్వర్యాన గత వారం రోజులుగా సాగుతున్న ఈ పోటీల్లో 50 మందికి పైగా పహిల్వాన్లు పాల్గొన్నారు. ముఖ్యంగా, 60కేజీల బరువు విభాగంలో దుర్గేశ్ తన సమీప ప్రత్యర్థి అజర్‌ను ఓడించటం ద్వారా ఫైనల్లో బాలకేసరి అవార్డును పొందారు. ఈ అవార్డు నిర్వాహకుడు దేవీసింగ్.. బాలకేసరి గెలుపొందిన దుర్గేశ్‌కు సుందరమైన గదను బహూకరించి సత్కరించారు. మున్ముందు మల్ల యుద్ధానికి చెందిన వివిధ పోటీలలో గెలుపొందటం ద్వారా దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్నది తన కోరిక అని దుర్గేశ్ తెలిపాడు. తనకు కోచ్‌గా వ్యవహరించిన జీహెచ్ఎంసీ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ టి. విష్ణుసింగ్, కె. వీరాచారిలకు ధన్యవాదాలు చెప్పాడు.