Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్‌రెడ్డి డబ్బు అహంకారం వల్లే ఉప ఎన్నిక
- కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్టు బ్రదర్స్ : కడియం శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో మోడీ సర్కారు వల్ల దేశం అన్నింటా వెనక్కి పోయిందనీ, ఎనిమిదేండ్ల బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు దుర్భరంగా మారాయని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో అసెంబ్లీ ఆవరణంలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శానసమండలి విప్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీలు ఎ.మల్లేశం, గంగాధర్‌గౌడ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బుందనే రాజగోపాల్‌రెడ్డి అహంకారం, బీజేపీ అధికార దాహంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్ట్ బ్రదర్స్ అని అరోపించారు. డబ్బులతో రాజకీయాలను శాసించాలని చూస్తున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆ బ్రదర్స్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా మునుగోడులో బీజేపీ ఆటలు సాగవని నొక్కి చెప్పారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. తెలంగాణ అంటేనే బీజేపీకి కక్ష అనీ, విభజన హామీలను విస్మరిస్తున్నదని విమర్శించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజరు తమ అధిష్టానాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు. బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదని కిషన్‌రెడ్డి చెప్పడం సిగ్గు చేటన్నారు. రాజ్యాంగ హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని విమర్శించారు. బీజేపీని ఎవరైనా ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అనే ముద్ర వేస్తున్నారన్నారు. రాజకీయంగా తాము చెప్పినట్టు విననివారిపై ఈడీ, సీబీఐ, ఐటీలను మోడీ సర్కారు ఉసిగొల్పుతున్నదని విమర్శించారు. బీజేపీ పేద, బడుగు, బలహీనవర్గాలకు శత్రువన్నారు. రూపాయి విలువ దారుణంగా పడిపోయిందనీ, ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతున్నదని చెప్పారు. ప్రభుత్వ సంస్థలను అమ్ము తున్నారనీ, కార్పొరేట్ శక్తులకు మాత్రం రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని విమర్శించారు. దేశంలో ఆహార కొరత తీవ్రంగా వేధిస్తున్నదని గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ను ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ దిగజారిపోవడం బాధాకర మన్నారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే మనం దిగువన ఉండటం సిగ్గుచేటన్నారు. పేదలకిచ్చే సబ్సిడీలను ఎత్తివేసే పనిలో మోడీ సర్కారు ఉందని విమర్శించారు. ఓవైపు దేశాన్ని అధో గతి పాలు చేస్తూనే మరోవైపు కులాల మధ్య కుంపట్లు పెట్టి, మతాల మధ్య అగ్గి రాజేసి బీజేపీ చలిమంటను కాసుకుంటున్నదని ఆరోపించారు.