Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ వెంట తెలంగాణలో లక్షల మంది నడక
- టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
దేశంలో బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో చేస్తున్న రాజకీయాలను రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా స్వస్తి పలుకుతున్నామని టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు ప్రధాన అంశాలను ముందు పెట్టుకొని రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. లౌకికదేశంలో మత రాజకీయాలను ప్రధాన ఎజెండాగా తీసుకొని పనిచేస్తుందన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలు ఆశించిన ఫలాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అందించలేకపోయిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో మంచి ఫలితాలు ఇస్తుందని, లక్షలాది మంది ప్రజలు రాహుల్ గాంధీ వెనుక నడవడానికి ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 23న రాహుల్ గాంధీ ఉమ్మడి జిల్లాలోని మక్తల్‌లోకి ప్రవేశిస్తారని తెలిపారు. దేవరకద్ర మన్యంకొండ జడ్చర్ల, షాద్‌నగర్‌లో సభలు ఉంటాయన్నారు.
ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు ఒబేదుల్లా, గద్వాల పీసీసీ కార్యదర్శి ప్రదీప్ కుమార్, వినోద్ కుమార్, వెక్కరి అనిత, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.