Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆస్కీ' సదస్సులో వైద్య నిపుణులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రొమ్ము కాన్సర్ పట్ల మహిళలు అవగాహన పెంచుకోవాలని పలు వురు వైద్య నిపుణులు సూచించారు. ఈ వ్యాధిపై అపోహలు వద్దనీ, రొమ్ముల్లో ఏమాత్రం నొప్పి, గడ్డలు వంటివి ఉంటే తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. అంతర్జాతీయ రొమ్ము కాన్సర్ అవగాహన మాసం సందర్బంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ), డాక్టర్ కాకర్ల సుబ్బారావు సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సంయుక్తాధ్వర్యంలో రొమ్ము కాన్సర్ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఆస్కీ చైర్మెన్ కే పద్మనాభయ్య, డైరెక్టర్ జనరల్ డాక్టర్ నిర్మలాబాగ్చి, డాక్టర్ కాకర్ల సుబ్బారావు సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ సుభోద్ కందముతన్, కిమ్స్ ఆస్పత్రిలోని ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రేస్ట్ డీజీసెస్ విభాగం డైరెక్టర్, రొమ్ము కాన్సర్ సర్జన్ డాక్టర్ రఘురామ్ పిల్లారి శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 ఏండ్లు దాటిన ప్రతి మహిళా రొమ్ము కాన్సర్ గురించి ఆలోచించాలన్నారు. బరువు అదుపు తప్పుతున్నా, ఇంట్లో ఎవరైనా కాన్సర్ బారిన పడినా మరింత అప్రమత్తం కావాలని హెచ్చరించారు. పదిమంది మహిళలు రొమ్ముల్లో గడ్డలతో బాధపడుతుంటే వారిలో ఒక్కరికి కాన్సర్ గడ్డలు ఉండవచ్చనీ, నిపుణుల ఆధ్వర్యంలో వాటిని పరీక్షలు, చికిత్స తీసుకోవాలని చెప్పారు. మమ్మోగ్రఫీ, అల్ట్రాసౌండ్, కోర్ నీడిల్ బయాప్సీ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారని తెలిపారు. ప్రతి మహిళా తప్పనిసరిగా రొమ్ము కాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.