Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్తలకు ఒడిశా సీఎం పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అభివృద్ధి పథంలో సాగుతున్న ఒడిశా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సుస్థిరపాలన, బలమైన నాయకత్వం, పారదర్శకత, అపారమైన ఖనిజ సంపద, ఐటీ, ఫార్మా, ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయనీ, ప్రభుత్వపరంగా అన్ని రకాల అనుమతులను సింగిల్‌విండో విధానం ద్వారా ఇచ్చేస్తామని చెప్పారు. నైపుణ్యంతో కూడిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఒడిశాలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు 'మేక్ ఇన్ ఒడిశా కన్క్లేవ్-2022' (ఎమ్ఐఓ-20) నిర్వహిస్తున్నారు. దాని సన్నాహక సమావేశాల్లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఓ హౌటల్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఫిక్కి) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. పారిశ్రామికాభివృద్ధికి తమ రాష్ట్రంలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, రాయితీలను వివరించారు. నూతన ఆవిష్కరణల కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో భువనేశ్వర్‌లో 'ఓ-హబ్' ఏర్పాటు చేశామన్నారు.
ఓడిశా రాష్ట్రం అత్యంత వేగంగా 10.01 శాతం వృద్ధిని సాధిస్తున్నదనీ, కోవిడ్ తర్వాతి రెండేండ్లలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామన్నారు. స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తలు ఎమ్ఐఓ-22లో భాగస్వాములై, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సమావేశంలో ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ప్రతాప్ కేశరిదెబ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌చంద్ర మహాపాత్ర, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి హేమంత్ శర్మ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖల కార్యదర్శి మనోజ్‌కుమార్ మిశ్రా, ఫిక్కీ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా తదితరులు పాల్గొన్నారు.