Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి కవిత్వ కార్యశాలలో నాళేశ్వరం శంకరం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మానవదేహ నిర్మాణంలా, పచ్చని చెట్టులా కవిత్వ నిర్మాణముండాలని ప్రముఖ కవి, విమర్శకులు నాళేశ్వరం శంకరం సూచించారు. తెలంగాణ సాహితి హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు ఏబూషి నర్సింహా అధ్యక్షతన జరిగిన కవిత్వ కార్యశాలలో శంకరం ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కవిత్వ నిర్మాణం అన్న అంశంపై ఆయన మాట్లాడుతూ కవిత్వమంటే అనుకరణ, పదవిన్యాసం, అంత్యప్రాసలప్రోదిచేయడం కాదని అన్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన్నలు అనువాదం చేసినా వారి సొంత శైలి ఉందన్నారు. పోతన రచనలలో మాండలిక పదాల ప్రయోగాలను బట్టి ఏ ప్రాంతం వాడో నిర్ధారించారని చెప్పారు. ఆ విధంగా నేటి తరం కవులు వారి సొంత ముద్ర ఉండేలా కవిత్వం రాయాలని సూచించారు. ప్రపంచ దు:ఖాన్ని కవి సొంత దు:ఖంగా భావించినప్పుడే గొప్ప కవిత్వం వస్తుందన్నారు. చక్కటి శిల్ప, అభివ్యక్తితో సమకాలీన అంశాలను తీసుకుని కవిత్వం రాయాలని తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి కె ఆనందాచారి అన్నారు. నగర కార్యదర్శి నస్రీన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కవిత్వం సామాజికాంశం అన్న అంశంపై ఆయన మాట్లాడుతూ సోమసుందర్ వజ్రాయుధం, కుందూర్తి తెలంగాణ, శేషేంద్ర ఆధునిక మహాభారతం, శ్రీశ్రీ కవిత ఓ కవిత లాంటి కావ్యాల్లోని శక్తివంతమైన కవితలు వాటి నిర్మాణ శైలి పద ప్రయోగ విశిష్టతను వివరించారు. శేషేంద్ర జయంతిని కవిత్వ కార్యశాలగా నిర్వహించడమంటే ఆయనకు అంత కంటే గొప్పనివాళి ఉండబోదనీ, శేషేంద్ర కుమారుడు సాత్యకి అన్నారు. ప్రభాకరాచారి అధ్యక్ష్యతన జరిగిన శేషేంద్ర శర్మ జయంతి సభలో సాత్యకి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ శేషేంద్రపై ఒకరోజంత సాహిత్యంపై సభ జరపడం తాను ఎక్కడ చూడలేదనీ, ఎక్కడ జరగలేదనీ, ఇది చాలా గొప్ప విషయమని నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి మాట్లాడుతూ కవుల రచనలు ప్రజాపక్షం ఉండాలని కోరారు. అనంతరం కవిసమ్మేళనాన్ని యువకవి ముజాహిద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్కె సలీమా, రామకృష్ఱ చంద్రమౌళి, ఎం రేఖ, శరత్ సుదర్శి, వంశీ కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.