Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిర్గతమైన కాంగ్రెస్ అంతర్గత వైరం
- 241కి గాను పోలైన ఓట్లు 226
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన పోలింగ్‌లో 241 మంది ఓటర్లకుగానూ 226 మంది తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. అధ్యక్ష అభ్యర్థులు మల్లికార్జున ఖర్గే తరపున మల్లు రవి, షబ్బీర్ అలీ, శశిథరూర్ తరపున శ్రీకాంత్, సంతోష్‌లు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారిగా ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ విధులు నిర్వహించారు. రాష్ట్రంలో 238 మంది పీసీసీ డెలిగేట్లకు, ముగ్గురు ఏఐసీసీ సభ్యులకు ఓటు హక్కు ఉన్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మొదటి ఓటును మాజీ మంత్రి షబ్బీర్ అలీ వినియోగిం చుకోగా, ఆ తర్వాత పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, కె.జానారెడ్డి, రేవంత్‌రెడ్డి ఓటు వేశారు. రాష్ట్రానికి చెందిన పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో రిటర్నింగ్ అధికారిగా ఉండటంతో అక్కడే వినియోగిం చుకున్నారు. లక్ష్యదీప్ రిటర్నింగ్ ఆఫీసర్ హర్కర వేణుగోపాల్, కర్నాటకలో ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు ఓట్లు వేశారు.
పోలింగ్ సందర్బంగా జనగామలో అంతర్గత పోరు బహిర్గతమైంది. ఓటర్ల జాబితా అంశంలో ఏర్పడిన గందరగోళం ఉద్రిక్తతకు దారి తీసింది. జనగామ నియోజకవర్గం నుంచి ఓట్లు వేసే నేతల జాబితా మార్పుపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పలువురు సీనియర్లు నిరసనకు దిగారు. జనగామ నియోజకవర్గం నుంచి ఓటు వేసేందుకు పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డికి ఏఐసీసీ అవకాశం కల్పించి ఓటింగ్ కార్డులు జారీ చేసింది. ఆ ఇద్దరు నేతలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాంధీభవన్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. చివరి క్షణంలో ఓటరు జాబితా నుంచి చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి పేరు తొలగించి ఆయన స్థానంలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేరును చేర్చారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి కొమ్మూరి పేరును ఓటరు జాబితాలో పెట్టినట్టు సమాచారం. దీంతో శ్రీనివాస్‌రెడ్డితో పాటు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కూడా ఓటు వేసేందుకు వచ్చారు. చివరి క్షణంలో శ్రీనివాస్‌రెడ్డి పేరును తొలగించడం పట్ల పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నాలకు మాజీ మంత్రి జానారెడ్డి సర్దిచెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ నిరసనకు దిగారు. గాంధీభవన్ మెట్లపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లా డుతూ గాంధీభవన్ మెట్లపై నిరసన తెలిపే దౌర్భాగ్య పరిస్థితి రావడం అవమానకరమన్నారు. 55 ఏండ్ల నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకుని ఉంటున్న తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 11 గంటలకు తనతో పాటు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డికి కార్డులు ఇచ్చారనీ, 24 గంటలు గడవక ముందే మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఇలాంటి వ్యవస్థ ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్డులు ఇచ్చి ఎందుకు అవమానించారని ప్రశ్నిం చారు. ఏ కారణంతో పేరు తొలగించారో కాంగ్రెస్ కార్యకర్తలకు వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని డిమాండ్ చేసారు.
ప్రశాంతంగా ఎన్నికలు .... రాజ్ మోహన్ ఉన్నితన్
ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రిటర్నింగ్ అధికారి, ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ తెలిపారు. టీపీసీసీ నాయకుల పూర్తి మద్దతుతో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. మంగళవారం ఎన్నికల సంఘానికి బ్యాలెట్ బాక్స్ అందజేస్తామనీ, 19న ఎన్నికల ఫలితాలుంటాయని తెలిపారు.