Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీడీ కార్మికులకు తంబాకు నిలిపివేత
- ఆలస్యంగా వెలుగులోకి వీడీసీ నిర్వాకం
నవతెలంగాణ-ధర్పల్లి
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో ఓ మతానికి చెందిన సుమారు 80 కుటుంబాలను వీడీసీ బహిష్కరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమకు కిరాణా సమాన్లు విక్రయించడం లేదని, బీడీ కార్మికులకు తంబాకు సైతం ఇవ్వడం లేదని వాపోతూ బాధితులు సోమవారం ప్రజావాణీలో కలెక్టర్, సీపీకి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో గ్రామంలో ఎలాంటి గొడవ కావొద్దనే ఉద్దేశంతో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో.. స్థానిక ప్రజాప్రతినిధులు, వీడీసీ తమ మీద కక్ష కట్టి బహిష్కరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు రూ.5లక్షల జరిమానా విధించి తమ ప్రార్థనా మందిరాన్ని తొలగించాలని వీడీసీ తీర్మానించిందన్నారు. ఎంత బతిమిలాడినా వినకుండా తాము చెప్పిందే శాసనంగా వీడీసీ వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తమ కుటుంబాలకు కిరాణా దుకాణాల్లో సరుకులు ఇవ్వడం లేదని, వ్యవసాయ పనులకు ఎవ్వరూ పిలవడం లేదని, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు పనికి రావడం లేదని, ఆఖరికి బీడీ కార్మికులకు తంబాకు కూడా పోయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఐ చంద్రశేఖర్గౌడ్కు సంప్రదించగా సోమవారం పిలిచి మాట్లాడుతానని చెప్పి చర్యలు తీసుకోకపోవడంతో తామే ప్రజావాణికి వచ్చినట్టు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.