Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని రెండో ఎఎన్‌యంలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ఏఎన్‌యంలు, ఇతర సిబ్బందిని యధావిధిగా రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 20న ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల డీఎంహెచ్ఓ కార్యాలయాల ముందు ధర్నా చేయనున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీయూఎంహెచ్‌ఇయూ) తెలిపింది. సోమవారం హైదరాబాద్‌లో యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, పని ఒత్తిడి తగ్గించాలనీ, ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 20 ఏండ్లుగా పని చేస్తున్న వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర చట్టబద్ధ హక్కులు అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఒకే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నప్పటికీ శ్రమ దోపిడీకి పాల్పడటం అత్యంత దుర్మార్గమన్నారు. మానసికంగా, శారీరకంగా కుంగిపోయి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుభూతితో ఆలోచించి కాంట్రాక్టు ఏఎన్ఎంలందర్నీ యధావిధిగా రెగ్యులర్ చేయాలని కోరారు.
'11వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ. 31,040తో పాటు డీఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు ఇవ్వాలి. యూనిఫామ్ అలవెన్సు రూ.2,500 రూపాయలు, వ్యాక్సిన్ అలవెన్సు రూ.500 ఇవ్వాలి. 35 రోజులు క్యాజువల్ లీవ్ లు, 180 రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్‌లు, మెడికల్ లీవ్లివ్వాలి, సబ్ సెంటర్ అద్దె రూ.1,000, స్టేషనరీ, జీరాక్స్ ఖర్చులు ఇప్పించాలి. నైట్ డ్యూటీలు, ఓపీ డ్యూటీలు రద్దు చేయాలి. బదిలీలకు అవకాశం కల్పించాలి. విధి నిర్వహణలో చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ఫీల్డ్ డ్యూటీ చేస్తున్నందున ఎఫ్‌టీఏ సౌకర్యం కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి...' అని యాదానాయక్ డిమాండ్ చేశారు.. వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే డిమాండ్లతో చేస్తున్న ధర్నాకు ఏఎన్ఎంలు తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్లు కె.బలరాం, మహమ్మద్ ఫసియోధ్ధీన్, ఎ.కవిత, వి.మరియ, ఎస్.హరి శంకర్, ప్రవీణ్ రెడ్డి, వి.విజయవర్దన్ రాజు, జె.సుధాకర్, కె.వీరయ్య, సంజుజార్జ్, వేణుగోపాల్, జె.ఏడుకోండల్, విజయలక్ష్మి, సరోజ, శ్రీనివాస్, సుగుణ తదితరులు పాల్గొన్నారు.