Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ సోమవారం షెడ్యూల్ను విడుదల చేశారు. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని అభ్యర్థులు ఈనెల 21న ఆన్లైన్లో ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 22న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 26న తుది విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయిస్తామని వివరించారు. తుదివిడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 26 నుంచి 28 వరకు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించాలనీ, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కోరారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 27న స్పాట్ ప్రవేశాల మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఇంజినీరింగ్ రెండు విడతల్లో సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో 177 ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 78,336 సీట్లున్నాయి. మొదటి, రెండు విడతల్లో కలిపి 64,134 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఇంకా 14,202 సీట్లు మిగిలాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సుల్లో 2,691 సీట్లు అందుబాటులో ఉన్నాయి.