Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డికి ఓటేయాలా..
- ప్రభాకర్‌రెడ్డి గెలుపు మునుగోడు అభివృద్ధికి మలుపు: ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ -మర్రిగూడ
మోటార్లకు మీటర్లు పెట్టే పార్టీని మీటర్ లోతులో పాతరెయ్యాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ''18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడు పోయిన రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అవుతాడంట.. ఏం లాభం. వ్యక్తి లాభ పడాలా, ప్రజలు లాభ పడాలా ఆలోచించండి'' అని మంత్రి పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ(ఎం), సీపీఐ బలబర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ మంగళవారం రాత్రి మర్రిగూడ మండల కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, వామపక్షాల నాయకులతో కలిసి హరీశ్‌రావు రోడ్ షో నిర్వహించారు. ప్రజలు పెద్దఎత్తున బోనాలు, డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క కొబ్బరికాయ కొడితే వంద పనులవుతాయన్న బీజేపీ నాయకులు ఎందుకు పనులు చేయడం లేదన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు వస్తున్నారెందుకని ప్రశ్నించారు. 2003లోనే సీఎం కేసీఆర్ మర్రిగుడలో పల్లె నిద్ర చేసి ఫ్లోరైడ్ బాధలు చూసి, ఆ బాధలు తీర్చారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఏనాడైనా ప్రజల నీటి కష్టాలు తీర్చారా..? అంశాల స్వామి వంటి వారు మా బతుకులు మార్చాలని అడిగినా కనికరం చూపలేదని చెప్పారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బండి సంజరు, కిషన్‌రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయిమంటే కిషన్‌రెడ్డి వెన్ను చూపి పారిపోయాడని విమర్శించారు. 8ఏండ్లు అయినా కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చలేదన్నారు. ఇక్కడ మూడు వేల రూపాయల పింఛన్ ఇస్తామంటున్నారు.. మరి ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.750, కర్ణాటకలో రూ.600లే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. మర్రిగుడ మండలానికి ఏనాడైనా వచ్చారా రాజగోపాల్‌రెడ్డి అని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవలా, మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలవాలా ఓటర్లు ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీని గెలిపిస్తే బాయికాడ మీటర్లు వస్తాయి.. ఇంటికి కరెంట్ బిల్లులు వస్తాయి అన్నారు. ఇప్పటికే గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు.. అయినా వాళ్లకి ఓటు వేస్తే ఇంకా ధరలు పెంచుతారని చెప్పారు. మునుగోడు యువత ఇక్కడికి వచ్చే కేంద్ర మంత్రులను నిలదీయాలన్నారు. మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటా అన్నరు.. అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామనిచ ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కమ్యూనిస్టులే తగిన గుణపాఠం చెబుతారు
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున
మతోన్మాద బీజేపీకి కమ్యూనిస్టులే తగిన గుణపాఠం చెబుతారని సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. మునుగోడులో గేలేసేది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే అని చెప్పారు. బీజేపీకి అమ్ముడు పోయిన రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మునుగోడు మాజీ శాసనసభ్యులు యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.