Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసి రంగుమారిన ధాన్యానికీ గిట్టుబాటు ధర కల్పించండి
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా తడిసి రంగు మారిన ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. ఈ ఖరీఫ్ సీజన్లో బోర్లు, బావుల కింద వేసిన వరి పంట కోత తీస్తున్నారని తెలిపారు. గత 15 రోజులుగా ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో నిలువ చేసుకుని రైతులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ధాన్యం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నదని తెలిపారు. మరోవైపు గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరిచేలు అడ్డంపడి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వర్షాలకు కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి రంగు మారే అవకాశముందని పేర్కొన్నారు. దీంతో కొనుగోలు సమయంలో అందుకు నిరాకరిస్తే రైతులు మరింత నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ స్పందించి వెంటనే ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు, తడిసి రంగు మారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.