Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే విడుదల చేయాలి
- పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రొఫెసర్ సాయిబాబాను రాజ్యం, ఎన్ఐఏ, ఉపా వంటివి వెంటాడి అప్రజాస్వామికంగా జైలులో మగ్గేలా చేస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ విమర్శించారు. ఆయనపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతున్నదని అన్నారు. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ 2014లో సాయిబాబాను అరెస్టు చేసే నాటికి ఎలాంటి నేర చరిత్ర లేదనీ, నేరాలకు పాల్పడలేదని చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అక్రమ కేసులో జైలుకు పంపడంతో ఢిల్లీ వర్సిటీలో ఆయనకున్న ప్రొఫెసర్ ఉద్యోగం ఊడిపోయిందన్నారు. ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి అష్టకష్టాలపాలయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు దెబ్బతిన్నాయని అన్నారు. ఆయనకు చిన్నప్పుడే పోలియో సోకడంతో 90 శాతం వికలాంగుడై చక్రాల కుర్చీకే పరిమితమయ్యారని వివరించారు. గుండెకు సంబంధించిన వ్యాధులతోపాటు ఇతర అనారోగ్య ఇబ్బందులు పట్టిపీడిస్తున్నాయని చెప్పారు. ఆయనతోపాటు ప్రశాంత్ రాహి, హేమ్మిశ్రా, విజరు టిర్కి, మహేష్ టిర్కి జైలులో మగ్గుతున్నారని అన్నారు. ఆయన సహ నిందితులు పాండు పోర నరోటె, ఫాదర్ స్టాన్ స్వామి అనారోగ్య సమస్యలతో ఇటీవల జైలులోనే మరణించారని వివరించారు. బాంబే హైకోర్టు (నాగ్పూర్ బెంచ్) సాయిబాబాను నిర్దోషిగా నిర్ధారించి విడుదల చేయాలంటూ ఈనెల 14న ఆదేశించిందన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులంతా హర్షం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. మరుసటి రోజు అంటే ఈనెల 15న హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు నిలిపివేసిందన్నారు. న్యాయస్థానాలు స్వతంత్రంగా వ్యవహరించాలనీ, సామాజిక న్యాయం అందించాలని కోరారు. సాయిబాబా విడుదల నిలుపుదలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపా చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలనీ, ఎన్ఐఏను రద్దు చేయాలని చెప్పారు. వచ్చేనెల ఎనిమిదిన సాయిబాబాపై కేసు విచారణలో సుప్రీంకోర్టు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, నాయకులు జి జాబాలి, విష్ణువర్ధన్రావు, తాళ్లపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.