Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పల్‌లో తండ్రీకొడుకు హత్య కేసును ఛేదించిన పోలీసులు
- ఐదుగురు నిందితుల అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల హత్య కేసును ఉప్పల్ పోలీసులు, ఎస్వోటీ బృందాల సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. గత శుక్రవారం ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలోని తండ్రీకొడుకులు హత్యకు గురైన సంగతి తెలిసిందే. స్థిరాస్తి తగాదాలే హత్యలకు కారణమని తొలుత పోలీసులు భావించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరోకోణం వెలుగుచూసింది. మంగళవారం నేరేడ్మెట్లోని సీపీ కార్యాలయంలో సీపీ మహేష్‌భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
తూకారాంగేట్కు చెందిన ఎల్.వినరు యోగేందర్‌రెడ్డి ప్రధాన నిందితుడు. 1991లో యోగేందర్‌రెడ్డి తండ్రి పర్మా యోగేందర్‌రెడ్డి హత్యకు గురికావడంతో అప్పటి నుంచి వినరు తన కుటుంబసభ్యులతో కలిసి ఉప్పల్‌లో నాన్నమ్మ ఇంట్లో ఉన్నారు. మామిడిపల్లిలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో హనుమసాయినగర్‌కు చెందిన పురోహితుడైన నర్సింహ శర్మ(78)తో పరిచయం ఏర్పడింది. ఇదిలావుండగా 2016లో వినరు ఎస్ఐ ఉద్యోగం కోసం పరీక్షలకు సిద్ధమవుతుండగా నర్సింహ శర్మ క్షుద్రజూలు చేసి ఉద్యోగం వచ్చేలా చేస్తానని నమ్మించాడు. పూజల కోసం రూ.6లక్షలు తీసుకున్నాడు. అయితే ఉద్యోగం రాకపోవడంతో తాను ఇచ్చిన డబ్బులను తిరిగివ్వాలని వినరు కోరాడు. ఇదిలావుండగా వరుణ్ అనే వ్యక్తి వద్ద రూ.13.5లక్షలను వినరు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో వినరు తిరిగి నర్సింహ శర్మను కలిశాడు. పూజలు చేసి డబ్బులిప్పిస్తానని నమ్మించిన మరో రూ.40వేలు తీసుకున్నాడు. కొంత కాలానికి వరుణ్ సగం డబ్బులు ఇవ్వడంతో అందులో నుంచి రూ.1.50లక్షలు శర్మ తీసుకున్నాడు. 2019లో వినరు అస్ట్రేలియాకు వెళ్లే సమయంలో పూజల కోసం మరికొంత డబ్బులను శర్మ తీసు కున్నాడు. అయితే, కరోనా ఆస్ట్రేలియా నుంచి వినరు 2020లో ఇండియాకు వచ్చాడు. తన లైఫ్ సెటిల్కాక పోవడంతో శర్మను నిలదీశాడు. గ్రహాలు సరిగా పనిచేయడం లేని వినరుని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ తన డబ్బులు తిరిగివ్వాలని వినరు డిమాండ్ చేయడంతో వివాదం జరిగింది. ఆ తర్వాత వినరుకి ఆరోగ్యం బాగోలేక పోవడం, ఓసారి రోడ్డు ప్రమాదం జరగడంతో ఇదంతా శర్మ క్షుద్రపూజలు చేయడం వల్లేనని అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా శర్మను హత్య చేయాలని ఆలోచనకు వచ్చిన వినరు తన స్నేహితులైన చంపాపేట్‌కు చెందిన యాలబాల క్రిష్ణా, మామిడిపల్లికి చెందిన లాల జగదీష్‌గౌడ్, ఆసీఫ్‌నగర్‌కు చెందిన జి.రామ్, ఫిల్మింనగర్కు చెందిన జి.శ్యాంసుందర్‌కు విషయం చెప్పాడు. పురోహితుడు నర్సింహ శర్మ కదలికలను తెలుసుకునేందుకు ఆయన ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్లో అద్దెకు దిగారు. వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి, శుక్రవారం ఉదయం బ్యాగులల్లో కత్తులు పెట్టుకుని శర్మ ఇంట్లోకి ప్రవేశించారు. శర్మ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అడ్డుగా వచ్చిన అతని కొడుకు శ్రీనివాస్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఎదురుగా వచ్చిన పనిమనిషిని బెదిరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తండ్రీకొడుకుల హత్య కేసు సంచలనం రేపడంతో సివిల్ పోలీసులతోపాటు ఎస్వోటీ పోలీసులను రంగంలోకి దించారు. సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించారు. సెల్‌ఫోన్ సిగల్స్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. ఈ సమా వేశంలో డీసీపీలు రక్షితా మూర్తీ, కె.మురళీధర్, ఏసీపీ పి.నరేష్‌రెడ్డి, వెంకన్న నాయక్, ఇన్స్పెక్టర్ రాములు, ఉప్పల్ సీఐ గోవర్థన్ రెడ్డి, ఎస్ఐ బి.నెహ్రూతోపాటు సివిల్, ఎస్వోటీ పోలీసులు పాల్గొన్నారు.