Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనాథలైన ఇద్దరు ఆడపిల్లలు
- అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం
నవతెలంగాణ - ఎలిగేడు
విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా తల్లిదండ్రులను కోల్పోయి.. ఇద్దరు ఆడ పిల్లలు అనాథలయ్యారు. పొలంలో చేనుకు పురుగుల మందు కొట్టేందుకు వెళ్లిన దంపతులిద్దరూ.. అప్పటికే తెగి పడిన విద్యుత్ వైరు తగిలి విద్యుద్ఘాతంతో మృతిచెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఏలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..జాతరగొండ ఓదెలు(40), జాతరగొండ రజిత(35) తమ నాలుగు ఎకరాల పొలానికి పురుగుల మందు స్ప్రే చేసేందుకు ఉదయం ఎనిమిది గంటలకు చేనుకు వెళ్లారు. ఓదెలు ముందుగా పొలంలో కాలు పెట్టగానే అప్పటికే తెగిపడి ఉన్న 33/11కేవీ విద్యుత్ తీగ తగిలి విద్యుద్ఘాతంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. ఒడ్డు మీద ఉన్న భార్య రజిత భయాందోళనతో భర్తకు ఏమైందోనని పొలంలోకి దిగింది. వైరు ఆమె కాలికి కూడా తగలడంతో మృతిచెందింది. విగతజీవివులుగా పడి వున్న తల్లిదండ్రులను చూసి వారి కుమార్తెలు కృష్ణవేణి, సంజన, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విద్యుత్‌శాఖ ఉద్యోగుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి జూలపల్లి ఎస్ఐ వెంకటకృష్ణ, చొప్పదండి ఎస్ఐలు చేరుకొని వివరాలు సేకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.