Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌ను చంపేస్తానని తిరుగుతున్నాడు
- మునుగోడులో పాల్వాయి స్రవంతిని గెలిపించండి
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బొడ్లో కత్తి పెట్టుకొని కాంగ్రెస్‌ను చంపేస్తానని తిరుగుతున్నాడని, ఇది న్యాయమేనా అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి, లక్కారం, చౌటుప్పల్ పట్టణంలో మంగళవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని చిన్నకొండూరు రోడ్డు చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ''ఈ ఉప ఎన్నిక మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి రాలే.. డిండి ప్రాజెక్టు పూర్తిచేసి చివరి ఆయాకట్టు వరకు నీళ్లివ్వడానికి రాలే.. రాచకొండ ప్రాంతంలో గిరిజనులకు పట్టాలు ఇవ్వడానికి రాలే.. చౌటుప్పల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వనందుకు రాలే.. మునుగోడులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇవ్వడానికి రాలే.. శివన్నగూడెంలో మునిగిపోయిన బాధిత రైతులను ఆదుకునేందుకు రాలే.. చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి చేయనందుకు రాలే.. ఇక్కడి ఎమ్మెల్యే చచ్చిపోతే రాలే.. 22వేల ఓట్లతో గెలిపిస్తే.. 22వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది'' అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక ఆడబిడ్డ ఆశీర్వదించాలని సోనియాగాంధీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ ఇస్తే.. ఆడ బిడ్డను ఓడించడానికి ఢిల్లీ నుంచి మోడీ, అమిత్‌షా వచ్చారని ఎద్దేవా చేశారు. 2009లో ఎంపీగా, 2014లో ఎమ్మెల్సీగా, 2018లో ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ గెలిపిస్తే ఇప్పుడు బొడ్లో కత్తి పెట్టుకొని కాంగ్రెస్‌ను చంపేస్తానని తిరుగుతున్నాడని ఆరోపించారు. పెంచి పోషించి పెద్దవాన్ని చేస్తే.. వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిం చుకుని.. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని చంపాలని చూస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.