Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన మున్సిపల్ కమిషనర్
- మున్సిపల్లో ముడుపుల వ్యవహారాన్ని ముందే చెప్పిన 'నవ తెలంగాణ'
నవతెలంగాణ - వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మంగళవారం ఏసీబీ దాడులు జరిగాయి. మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ రావు రూ.30వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం..
వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన సుంకరి మహేశ్ మున్సిపల్ కాంట్రాక్టర్. పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, చామకుంట కూరగాయాల మార్కెట్, తెట్టెకుంటలోని డంపింగ్ యార్డు పనులకు సంబంధించి నిర్మాణ గడువు ముగియడంతో గడువు పెంపు కోసం కమిషనర్‌ను సంప్రదించారు. కమిషనర్ శ్యాంసుందర్‌రావు రూ.50వేలు లంచం డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు మహేశ్ ఈ నెల 13న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పూర్తి సమాచారం సేకరించి, నిజ నిర్ధారణ చేసుకున్న అనంతరం మంగళవారం దాడులు నిర్వహించారు. ముందుగా అనుకున్న ప్రకారం మహేశ్ దగ్గరి బంధువు అయిన కోనరావుపేట మండలానికి చెందిన సత్యంతో కమిషనర్‌కు రూ.30వేలు పంపించారు. ఈ డబ్బులను కమిషనర్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమిషనర్‌ను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కమిషనర్‌కు సంబంధించి కరీంనగర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
ముందే చెప్పిన ''నవతెలంగాణ''
వేములవాడ మున్సిపల్లో కొంతకాలంగా జరుగుతున్న ముడుపుల వ్యవహారంపై 'నవతెలంగాణ' దినపత్రిక ముందు నుండే పలు కథనాలు ప్రచురించింది. ఈ క్రమంలోనే సోమవారం వెలువడిన సంచికలో ''ముడుపులందితే సక్రమం.. లేదంటే అక్రమం'' శీర్షికన కథనం ప్రచురితమైంది. వార్తా కథనం ప్రచురితమై 24గంటలు గడవకముందే మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం, కమిషనరే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అక్రమాలను వెలికితీయడంలో ''నవతెలంగాణ'' ముందుంటుందంటూ పత్రికపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.