Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీఏలో 86.44 శాతం మందికి సీట్లు
- 21 వరకు సెల్ఫ్రిపోర్టింగ్కు గడువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియలో మంగళవారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏలో కలిపి ఐసెట్‌లో 26,201 సీట్లున్నాయనీ, వాటిలో 23,001 (87.79 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. 3,192 (12.21 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు. 252 ఎంబీఏ కాలేజీల్లో 23,525 సీట్లున్నాయనీ, వాటిలో 20,336 (86.44 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఇంకా 3,189 (13.56 శాతం) సీట్లు మిగిలాయని వివరించారు. 20 ప్రభుత్వ కాలేజీల్లో 1,465 సీట్లుంటే, 1,386 (94.61 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. 79 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. రెండు విశ్వవిద్యాలయ కాలేజీల్లో 182 సీట్లుండగా, 169 (92.86 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. ఇంకా 13 సీట్లు మిగిలాయని తెలిపారు. 230 ప్రయివేటు కాలేజీల్లో 21,878 సీట్లుంటే, 18,781 (85.84 శాతం) మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఎంసీఏకు సంబంధించి 43 కాలేజీల్లో 2,676 సీట్లున్నాయనీ, వాటిలో 2,673 (99.89 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. ఎంసీఏలో కేవలం మూడు సీట్లు మాత్రమే మిగిలాయని తెలిపారు. ఇందులో 16 ప్రభుత్వ కాలేజీల్లో 977 సీట్లుంటే వందశాతం సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. 27 ప్రయివేటు కాలేజీల్లో 1,699 సీట్లకుగాను 1,696 (99.82 శాతం) సీట్లు భర్తీ చేశామని వివరించారు. ఇంకా మూడు సీట్లు మిగిలాయని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద 829 మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఈనెల 21 వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని సూచించారు. లేకుంటే సీట్లు రద్దవుతాయని వివరించారు. ఇతర వివరాలకు https://tsicet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.