Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కారు గుర్తును పోలిన మరో ఎనిమిది సింబల్స్‌పై ఎన్నికల సంఘం ఇప్పటికైనా తన వైఖరిని స్పష్టం చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ టి.భాను ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయా గుర్తులను కేటాయించొద్దంటూ తమ పార్టీ తరపున మొదటి నుంచి చెబుతూ వచ్చామని ఆయన అన్నారు.
అయినా ఈసీ ఆ విషయాన్ని పెడచెవిన పెట్టిందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో రోడ్ రోలర్ గుర్తును తొలగించిన ఎన్నికల సంఘం... మళ్లీ ఇప్పుడు అదే గుర్తును కేటాయించిందని తెలిపారు. బీజేపీ ప్రమేయంతో ఈ విధంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఆ పార్టీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న తీరుకు ఇదే నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా ఈసీ నిస్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. రూపాయి పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను మంటగలిపేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఏం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావటం లేదని విమర్శించారు.