Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కారు తరహాలో ఉన్న గుర్తులను మునుగోడు ఉప ఎన్నికల్లో కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాస్కర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఈ మేరకు తీర్పును వెలువరించింది. కారును పోలిన ఎనిమిది గుర్తులను కేటాయించకుండా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఎస్ భరత్ కుమార్ దాఖలు చేసిన అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్‌పై ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈనెల పదో తేదీన ఇచ్చిన వినతిపత్రంపై ఈసీ స్పందించలేదనీ, అందుకే రిట్ దాఖలు చేయాల్సివచ్చిందని ఆయన తెలిపారు. ఉత్తర్వులు ఇవ్వకపోతే ఆయా గుర్తులను ఈసీ కేటాయిస్తుందని వివరించారు. దాని ఫలితం మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌పై ఉంటుందంటూ పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. ఆయన అభ్యర్థనలపై ఈసీ తరపు న్యాయవాది స్పందిస్తూ... ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కోర్టుల్లో కేసులు వేసి ఉత్తర్వులు పొందేందుకు వీల్లేదని తెలిపారు. గతంలో టీఆర్ఎస్ మూడు గుర్తులపై అభ్యంతరం చెబితే రెండింటిని జాబితా నుంచి తొలగించామనీ, ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత మరో ఎనిమిది గుర్తులపై వినతిపత్రం సమర్పిస్తే తిరస్కరించినట్లు వివరించారు.
ఇరుపక్షాల వాదనల తర్వాత టీఆర్ఎస్ వేసిన రిట్‌ను కొట్టేస్తూ డివిజన్ బెంచ్ తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో బీజేపీ తరఫున వాదించేందుకు మరో న్యాయవాది ప్రయత్నించగా అందుకు బెంచ్ అనుమతించలేదు.