Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సుల ఫీజులను పెంచడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. పెంచిన ఫీజులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులైన ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రభుత్వం గతం కంటే ఫీజులను భారీగా పెంచిందని విమర్శించారు. ఈ ఫీజులు కరోనా తర్వాత తమ పిల్లలను ఉన్నత విద్యను చదివించాలనుకుంటున్న తల్లిదండ్రులకు భారంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేఫధ్యంలో ప్రభుత్వం ఫీజులు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్ కళాశాలలకు కొమ్ముకాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని విమర్శించారు. ఇప్పటికే నూతన విద్యావిధానం పేరుతో విద్యా వ్యవస్థ సర్వం వ్యాపారీకరణకు గురవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయొద్దని కోరారు. ఈ విధానాలు అత్యంత నష్టదాయకమని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ఫీజులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇంజినీరింగ్ ఫీజుల పెంపు సరికాదు : ఏఐఎస్ఎఫ్
రాష్ట్రంలోని 159 ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏఎఫ్ఆర్సీ సిఫారసులతో ప్రభుత్వం ఫీజులు పెంచడం సరైంది కాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. కనీస ఫీజు రూ.35 వేల నుండి రూ.45 వేల వరకు పెంచారని తెలిపారు. 40 కళాశాలల్లో రూ.లక్షపైన ఫీజు పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యకు దూరమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ఫీజులు పెంచిన ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు జీవోను వెనక్కి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
కరోనా పరిస్థితుల్లో...ఫీజుల పెంపా? : టీఎస్టీసీఈఏ
కరోనా పరిస్థితుల్లో ఇంజినీరింగ్ కాలేజీలకు ఖర్చుల్లేవనీ, ఈ సమయంలో ఫీజులను ఎలా పెంచారని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బోధన, బోధనేతర సిబ్బందికి సక్రమంగా జీతాలు చెల్లించని కాలేజీలకు ఫీజులను పెంచడం సరైంది కాదని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులే లేరనీ, ఫీజులను కాలేజీల కోసమే పెంచారని విమర్శించారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఫీజుల పెంపు పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.