Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు డీజీ స్వాత్రి లక్రా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఈ నెల 20వరకు మహిళలపై వేధింపులకు సంబంధించి 5,135 కేసులు షీ టీమ్స్ విభాగంలో నమోదైనట్టు రాష్ట్ర మహిళ భద్రత విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. ఇందులో 916 కేసులలో విచారణను పూర్తిచేసి దోషులను అరెస్టు చేసినట్టు ఆమె వివరించారు. మహిళ భద్రత విభాగం ఏర్పడిన తర్వాత దాని ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 315 షీ టీమ్‌లను ఏర్పాటు చేసి.. మహిళల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు తెలిపారు.
ముఖ్యంగా, నమోదైన కేసులలో చాలావరకు వాట్సాప్‌లు, ఫేస్బుక్, ఫోన్ల ద్వారా ఫిర్యాదులు వచ్చినట్టు ఆమె వివరించారు. వీటిన్నంటిని క్షుణ్ణంగా పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకుంటున్నట్టు స్వాత్రి లక్రా వివరించారు. మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా 9వేలకుపైగా స్కూల్ పిల్లలతో సైబర్ అంబాసిడర్లు ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. సైబర్ నేరాలు జరిగే విధానంపై వారికి తగిన శిక్షణ ఇవ్వడమే కాక, అలాంటి నేరాల బారిన పడకుండా మహిళలను, యువతులను చైతన్యపరిచేలా సైబర్ అంబాసిడర్లు కృషిచేస్తున్నారని ఆమె వివరించారు.
సైబర్ నేరాల్లో హైదరాబాద్ సిటీ మొదటి స్థానంలో నిలిచిందని స్వాతి లక్రా చెప్పారు. మొత్తంమీద వివిధ కాలేజీల్లో సైతం సైబర్ క్లబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకూ ఈ నేరాలపై తగిన అవగాహన కల్పించడంతో పాటు వారి ద్వారా మహిళలను చైతన్యపరిచే కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్టు ఆమె చెప్పారు.