Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్
కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ ఆర్టీసీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌కు తక్షణం పాలకమండలి ఎన్నికలు నిర్వహించాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో వీఎస్టీ చౌరస్తాలోని ఆ సంస్థ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, వైస్ చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్ మాట్లాడుతూ ప్రస్తుత పాలకమండలి కాలపరిమితి 2021 నవంబర్ 21 నాటికే ముగిసిందని చెప్పారు. కార్మికుల జీతాల్లో నుంచి పొదుపు చేసుకున్న సొమ్మును ఆర్టీసీ యాజమాన్యం స్వంతానికి వాడుకొని, చెల్లించట్లేదన్నారు. సొసైటీ రుణాల కోసం కార్మికులు దరఖాస్తు చేసుకుంటే గతంలో వారంరోజుల లోపు వచ్చేదనీ, ఇప్పుడు ఏండ్లు గడుస్తున్నా రావట్లేదన్నారు. కాలపరిమితి ముగిసిన పాలకమండలి నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జి కమిటీని రెన్యువల్ చేయించుకుంటున్నదనీ, ఎన్నికల నిర్వహణపై శ్రద్ధ పెట్టట్లేదన్నారు. తక్షణం ఎన్నికల కోసం రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్‌కు ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదనలు వస్తే 30 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రిజిస్ట్రార్ చెప్తున్నారని వివరించారు. కార్మికుల జీతాల్లోంచి రికవరీ చేసిన సొమ్మును యాజమాన్యం ఏనెలకు ఆ నెలే వారి సీసీఎస్ ఖాతాల్లో జమచేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఎస్ సురేష్, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, గుడిసెల అబ్రహాం, కోశాధికారి డీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.