Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక్కడ ఓటు కూడా లేని వ్యక్తి బీజేపీ అభ్యర్థి
- రంగు మార్చి మారు వేషంలో వస్తున్నవారికి బుద్ధి చెప్పాలి
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ- మునుగోడు
ఓట్ల కోసం తప్ప సంక్షేమం పట్టని వారికి.. చైతన్యవంతులైన మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్టు చెప్పి.. రంగు, జెండా మార్చి మారు వేషంలో వస్తున్న వారిని నమ్మొద్దని సూచించారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కిష్టాపురం, పలివల, ఊకోండి గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులన్నారు. గతంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాబూజీ, ధర్మ బిక్షం, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, చైతన్యవంతమైన కమ్యూనిస్టులను గెలిపించుకున్న గడ్డ అని గుర్తు చేశారు. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలను మోసం చేసేందుకు జెండా, రంగు మార్చి మీ దగ్గరకు మారు వేషంలో వస్తున్నారు.. వారి మాయమాటలకు, డబ్బు, మద్యం ప్రలోబాలకు లొంగకుండా ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. వారికి ఓట్లు కావాలికానీ.. గెలిచిన తర్వాత సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు. ఇక్కడ ఓటు కూడా లేని వ్యక్తి బీజేపీ అభ్యర్థిగా వస్తున్నాడని విమర్శించారు. చీకటి పడితే చాలు సీసాలు గ్రామాలకు చేరుతున్నాయని, చిన్నపిల్లలు సైతం సీసాలు పట్టి ఆగమయ్యే ప్రమాదం ఉందని అన్నారు.
ఈ నియోజకవర్గం ఏర్పడిననాటి నుంచి 12 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా మహిళలు ఎమ్మెల్యేగా గెలుపొందలేదన్నారు. ఈసారి ఆ అవకాశం ఆడబిడ్డకు ఇవ్వాలని కోరారు. ఉన్నతమైన చదువులు చదివి.. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని నియోజకవర్గంలోని ప్రతి సమస్యపైనా అవగాహన కలిగిన పాల్వాయి స్రవంత్రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, రాష్ట్ర నాయకులు పున్న కైలాస్ నేత, ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్, మునుగోడు మండల ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, చలమల కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు నన్నూరు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.