Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు మాదే
- విలేకర్ల సమావేశంలో మంత్రి శ్రీనివాసగౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంబానీ.. ఆదానీల డబ్బుతో మునుగోడులో గెలిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఆబ్కారీ, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాసగౌడ్ విమర్శించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అక్కడ గెలిచేది టీఆర్ఎస్సేనని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.గంగాధరగౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్, కేంద్రం తమ చేతుల్లో ఉందనే ఉద్దేశంతో బీజేపీ నేతలు మునుగోడులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కారును పోలిన గుర్తులు వద్దంటున్నా కేటాయించేలా ఈసీపై ఒత్తిడి తేవటం ద్వారా బీజేపీ తొలి కుట్రకు తెరలేపిందని అన్నారు. మరోవైపు దుబ్బాక, హుజూరాబాద్‌లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని ఆ పార్టీ నేతలు ఇప్పుడు మునుగోడులో కూడా అవే హామీలిస్తున్నారని విమర్శించారు. మత ఘర్షణలను రెచ్చగొట్టి... ఓట్లు దండుకోవటం తప్ప బీజేపీకి వేరేదేమీ చేతకాదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కూడా అలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు.