Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీరామ్‌నాయక్, స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ-చివ్వెంల
గిరిజన యువకుడు ధరావత్ నిఖిల్‌నాయక్ హత్య కేసును చేధించడంలో ముమ్మాటికి పోలీసులు విఫలమయ్యారని తెలంగాణ గిరిజన సంఘం, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీరాంనాయక్, టి.స్కైలాబ్‌బాబు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేశ్ విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రాజుతండాలో నిఖిల్ కుటుంభసభ్యులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువ లాయర్ ధరావత్ నిఖిల్‌ది ముమ్మాటికీ కులదురహంకార హత్యేనన్నారు. హత్య జరిగి పది రోజులు కావొస్తున్నా ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడం దారుణమని, ఈ ఘటనకు ఎస్పీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గిరిజన యువకుడు కావడంతోనే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఖిల్ ఓ అమ్మాయిని ప్రేమించాడని, అమ్మాయి తరుపువారు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు నిఖిల్ కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తుందని తెలిపారు. పోలీసులు ఆ వైపు విచారణ జరపకుండా కేవలం స్నేహితుల మధ్య తగాదాగా చిత్రీకరించి ఆత్మహత్య కోణంలో కేసును నీరుగార్చేందుకు యత్నిస్తుండడం అన్యాయమన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు టెక్నాలజీ పరంగా ప్రథమ స్థానమని చెప్పుకునే ప్రభుత్వం.. నిఖిల్ హత్య జరిగి 10 రోజులు కావస్తున్నా దుండగులను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. రెండురోజుల్లో హత్య చేసిన దుండగులను పట్టుకోకపోతే జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలోనే దళిత, గిరిజన ప్రజాసంఘాలను సంప్రదించి రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. పరామర్శించిన వారిలో.. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ రవినాయక్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి, ఆవాజ్ జిల్లా కార్యదర్శి జహంగీర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వర్రావు, తెలంగాణ గిరిజనసంఘం జిల్లా కార్యదర్శి రాజేందర్‌నాయక్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, జిల్లా నాయకులు, తదితరులు ఉన్నారు.