Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పిలుపు
- మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా..
- సరిహద్దుల్లో నిరంతర నిఘా
నవతెలంగాణ-వెంకటాపురం
మావోయిస్టులు అడవులు వీడి జనంలోకి రావాలని, ఛత్తీస్గడ్- తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం ప్రత్యేక బలగాలు కూంబింగ్ చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్లో బుధవారం ఆయన పర్యటించారు. అనంతరం హెలిప్యాడ్ సమీపంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సరిహద్దుల్లో యాంటీ మావోయిస్టు కమిటీ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్, పారామిలటరీ, గ్రేహౌండ్స్, జిల్లా పోలీసు యంత్రాంగం, ఎస్ఐబీ నిరంతరం పనిచేస్తుందన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో 20 మందిలో 11 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారని, పార్టీలో మొత్తం 130 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. 60 ఏండ్లు పైబడిన మావోయిస్టులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, మావోయిస్టులు అడవులను వీడి జనంలోకి రావాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు అడవులను వీడేందుకు వారి కుటుంబసభ్యులు ప్రయత్నించాలని కోరారు. మావోయిస్టులు జనస్రవంతిలోకి వస్తే ప్రభుత్వపరంగా ఆదుకోవడంతో పాటు ఎటువంటి కేసులు నమోదు చేయకుండా చూస్తామని డీజీపీ హమీఇచ్చారు.
4 జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష
వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తడూడెం జిల్లాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు, కార్యాకలాపాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరాతీసినట్టు సమాచారం. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు పోలీసులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, చర్యలు, తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు నివారించేందుకు తీసుకోవాల్సిన ఆంశాలపై డీజీపీ జిల్లాల పోలీసులకు తెలిపినట్టు తెలిసింది. కాగా, ఏజన్సీ సరిహద్దు ప్రాంతంలో నాలుగు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిచడం దానికి తెలంగాణ పోలీసు బాసు డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరు కానుండటంతో ములుగు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశంలో స్పెషల్ ఇన్వేస్టిగేషన్ బ్రాంచ్ ఐజీ టి.ప్రభాకర్‌రావు, గ్రేహౌండ్స్ డీజీ కె.శ్రీనివాసరావు, అడిషనల్ డీజీ వై.నాగిరెడ్డి, ములుగు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్పాటీల్, ఓఎస్డీ గౌస్ఆలం, మహబుబాబాద్ ఎస్పీ శరత్ చంద్రపొవార్, ఏటూరునాగారం ఏఎస్పీ ఆశోక్‌కుమార్, సీఐ కాగితోజు శివప్రసాద్, ఎస్ఐలు తిరుపతి, అశోక్, పోలీసులు పాల్గొన్నారు.