Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలకు విరుద్ధంగా పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాల నిర్వహణ
- ఇప్పటివరకు 123 కేంద్రాల్లోనే ఆన్లైన్ పరీక్షలు
- సీరియస్గా తీసుకున్న రవాణాశాఖ
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్లో వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కరోనా నుంచి ప్రతి ఏటా ఈ సంఖ్య మరింత పెరుగుతున్నది. ఒకవైపు కొత్త వాహనాల నమోదవుతున్నప్పటికీ.. అదే స్థాయిలో పాత వాహనాలు కూడా పెద్దఎత్తున రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. వీటి నుంచి వెలువడే కాలుష్య కారకాలు నగర జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంతోపాటు ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కాలుష్య కారకాలను వెలువరించే వాహనాలకు కళ్లెం వేయాల్సిన పొల్యూషన్ టెస్టింట్ సెంటర్లు నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. దీంతో అప్పటివరకు ఉన్న ఆఫ్లైన్ విధానానికి చెక్ పెడుతూ.. మూడేండ్ల కిందట ఆన్లైన్ పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటు దిశగా రవాణాశాఖ చర్యలు తీసుకుంది. కొందరు నిర్వాహకులు స్పందించి ఆన్లైన్లోకి మారగా.. మరికొందరు దూరంగా ఉన్నారు. ఇటు ఆన్లైన్లోకి మార్చుకోక.. అటు రెన్యూవల్ చేసుకోకుండా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేస్తుండటంతో రవాణాశాఖ సీరియస్గా దృష్టిపెట్టింది. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న కేంద్రాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ జె.పాండురంగ నాయక్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యాలిడీ పత్రాలు, రెన్యూవల్ చేసుకోని వాటిని తక్షణమే సీజ్ చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో సమారు 750 వరకు మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలుండగా.. నగర పరిధిలో 200కుపైనే ఉన్నాయి. ఈ కాలుష్య తనిఖీ కేంద్రాలను ఆన్లైన్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రవాణాశాఖ మూడేండ్ల కిందటే ప్రణాళికలు రూపొందించింది. కాగా, ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 123 సెంటర్లు ఆన్లైన్లోకి మారడంతోపాటు ఆర్టీఏ నిబంధనల మేరకు నడుస్తున్నాయి. మరో 101 పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలు ఆన్లైన్లోకి మారకుండా దూరంగా ఉన్నాయి. ఒక్కో పొల్యూషన్ సెంటర్ నాలుగైదేండ్లుగా రెన్యూవల్ చేసుకోకుండానే నడుస్తున్నాయి. ఇవి నిర్వహించే తనిఖీల్లో ఎలాంటి ప్రామాణికత, శాస్త్రీయత లేకపోగా.. నామమాత్రపు పరీక్షలతో డబ్బులు దండుకుంటున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయినా.. ఈ సర్టిఫికెట్లనే ఆర్టీఏ అధికారులు ప్రామాణికంగా గుర్తించి వాహనాల వినియోగానికి అనుమతి ఇస్తున్నారు. ఆన్లైన్ మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్ల వల్ల ఇలాంటి తప్పుడు పరీక్షలకు అవకాశం లేకుండాపోతుంది. ఇకపోతే కరోనా కారణంగా రెండేండ్లుగా ఆదాయం అంతంతా మాత్రంగానే ఉందని పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు, మొబైల్ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ వారు చెబుతున్నారు. ఆన్లైన్ అనుసంధానానికి తాము స్వాగతిస్తున్నామని, అందుకు కొంత సమయం కావాలని వారు కోరుతున్నారు. అలాగే, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రేట్లను సవరించాలని, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే మనదగ్గర చాలా తక్కువగా ఉన్నాయని వివరిస్తున్నారు.
పీయూసీ ధ్రువీకరణ పత్రాల జారీ..
వాహన కాలుష్యాన్ని కచ్చితంగా నిర్ధారించి పీయూసీ సర్టిఫికెట్లు అందజేసేందుకు ఆన్లైన్ వ్యవస్థ దోహదం చేస్తుంది. వాహనాల్లో నుంచి వెలువడే పొగలో ఏ రకమైన కాలుష్య కారకాలు ఏ స్థాయిలో ఉన్నాయో శాస్త్రీయతను నిర్ధారించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా ప్రతిపాదించిన పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు పనిచేస్తాయి. వాహనాలకు అక్కడే పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. ఒకవేళ కాలుష్య కారకాలు అతిగా వెలువడితే సదరు వాహనానికి సర్టిఫికెట్ జారీ చేయరు. వాటిని వినియోగించకుండా చర్యలు తీసుకుంటారు. అంతేగాక ఈ మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలోని ప్రధాన సర్వర్తో అనుసంధానమై ఉంటాయి. వాహనాల కాలుష్య కారకాల మోతాదులను ఇక్కడి నుంచే నిర్దేశించి సర్టిఫికెట్లు జారీ చేయడమే ఆన్లైన్ పొల్యూషన్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యమని ఆర్టీఏ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలిచ్చాం
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చాం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగా రెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని వాహ నాల కాలుష్యాన్ని చెక్చేసే మొబైల్ పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్లలో సంబంధిత జిల్లా అధికారులు, ఆర్టీవోలు తనిఖీలు చేపట్టి అవసరమైన చర్యలు చేపడతారు. ప్రధానంగా లైసెన్స్ రెన్యూవల్ చేసు కోకుండా.. వ్యాలిడ్ పత్రాలు లేకుండా నిర్వహిస్తున్న పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలను సీజ్ చేయాలని ఆదేశించాం.
- జె. పాండురంగ నాయక్- జేటీసీ- హైదరాబాద్