Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలోనే తొలిసారిగా బీబీఏ రిటైలింగ్ కోర్సు
- ఈ ఏడాది సిటీ కళాశాలలో ప్రారంభం
- కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్
నవతెలంగాణ-ధూల్‌పేట్
డిగ్రీ పట్టాతోపాటు ఉద్యోగం పొందే కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీతోపాటు ఉద్యోగ, ఉపాధి అందించే కోర్సులపట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ చదివే సమయంలోనే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకుని డిగ్రీ పట్టాతోపాటు ఉద్యోగం కూడా పొందే బీబీఏ రిటైలింగ్ కోర్సును ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ సిటీ కళాశాలలో ప్రవేశపెట్టినట్టు తెలిపారు. డిగ్రీలో ప్రవేశం పొందేటప్పుడే, ఏ కోర్సుకు భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందొచ్చు అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు వారి ఆసక్తిని గమనించి నూతన విద్యా విధానానికి అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఈ కోర్సుకు సంబంధించిన కరిక్యులమ్, క్రెడిట్స్ విషయాలపై అధ్యయనం చేశామని, అందులో భాగంగానే కళాశాల విద్యాశాఖ, స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన రిటైలర్స్ అసోసియేషన్ ఒక ఒప్పందంపై సంతకం చేశాయన్నారు. ఈ ఒప్పందం ప్రకారం డిగ్రీ మూడు సంవత్సరాల కాలంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ అవకాశం, కోర్సు పూర్తైన వెంటనే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కోర్సు రాష్ట్రంలోనే తొలిసారిగా తమ కళాశాలలో ప్రవేశపెట్టడం పట్ల ప్రభుత్వ సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పి.బాలభాస్కర్, కామర్స్ శాఖ హెడ్ డాక్టర్ రత్నప్రభాకర్, డాక్టర్. మల్లికార్జున్, డాక్టర్.శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు.