Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెలీ కాన్ఫరెన్సులో కేసీఆర్
- ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సంబంధించిన రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుపై పదే పదే ప్రచారం నిర్వహించాలని టీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతోపాటు మోడీ ప్రభుత్వ విధానాలను కూడా ఎండగట్టాలని ఆయన కోరారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు కేసీఆర్ ఈనెల 11న ఆ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అప్పటి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ అంటే దాదాపు తొమ్మిది రోజులు ఆయన అక్కడే మకాం వేశారు. ఈ క్రమంలో సీఎం ఎవరెవరితో భేటీ అయ్యారు..? ఎవరెవరితో సమావేశాలు నిర్వహించారనే వివరాలను సీఎంవో అధికారులు గోప్యంగా ఉంచారు. పర్యటన అనంతరం ఆయన బుధవారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వచ్చీ రాగానే మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. తద్వారా ఆయన క్షేత్రస్థాయి ప్రచారం పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఇతర బాధ్యులతో మాట్లాడారు. సర్వేలన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని వారు తెలిపారు. అందువల్ల మునుగోడులో పర్యటిస్తున్న నాయకులందరూ అప్రమత్తంగా ఉండి... ఓటర్లను గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ అనంతరం... రాష్ట్రంలోని శాంతి భద్రతల వ్యవహారంపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.