Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి
- ఉత్పత్తి పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి చూపాలి
- సర్దార్ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించాలి: కల్లుగీత గీత కార్మికుల సింహగర్జన బహిరంగసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ పిలుపు
నవతెలంగాణ-యాదాద్రి
యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న ఈ మహాసభతో గీతన్నల తలరాత మారిపోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన గీత కార్మికుల సింహగర్జన బహిరంగ సభ భువనగిరి జిల్లా కార్యదర్శి బోలగాని జయరాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు గీత కార్మికులు వేలాదిగా తరలివచ్చారు. పట్టణకేంద్రంలో గీత కార్మికులు మోకుమోస్తాదు ధరించి పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కల్లు వృతిపై ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించి సొసైటీలకు భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి చూపాలని తెలిపారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలన్నారు. కొత్త గ్రామ పంచాయతీల్లో చెట్లు, గీత కార్మికులు ఉన్నచోట సొసైటీలకు అవకాశం కల్పించి, బెల్టు షాపులను తక్షణమే తొలిగించాలని డిమాండ్
చేశారు. మద్యనిషేదం దశలవారిగా అమలు చేసి వారానికి రెండు రోజులు లిక్కర్ డ్రై డేగా ప్రకటించాలన్నారు. సొసైటీల నిర్వహణపై అధ్యక్షులు, సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఆయా జిల్లాల్లో చైతన్య సభలు నిర్వహించాలని కోరారు. వృత్తి చేసేవారందరికి వయస్సుతో నిమిత్తం లేకుండా ఎలాంటి షరతులు విధించకుండా రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించి అయన నిర్మించిన, ఏలిన కోటలను పర్యాటక కేంద్రాలుగా గుర్తించి, అభివృద్ధి చేయాలని కోరారు. వేతన గీత కార్మికులకు అసోసియేట్ మెంబర్షిప్ ఇచ్చి కనీస వేతనాలు అమలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ కమ్యూనిటీ భవనం నిర్మాణం చేయాలని, ఏజెన్సీ ఏరియాలో సొసైటీలను పునరుద్ధరించి, సంక్షేమ పధకాలు వర్తింపజేేయాలని డిమాండ్ చేశారు. గీత పారిశ్రామిక సహకార సంఘాలకు, కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేసుకున్న గౌడ ఔత్సాహికులకు నీరా, బెల్లం తదితర ఉత్పత్తులు తయారు చేయాడానికి 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రూపు సొసైటీలు చేసుకున్న వారందరికి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలన్నారు. అనంతరం సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేండ్లు గడుస్తున్నా కార్పొరేషన్ ప్రకటించి ఇంతవరకు చైర్మెన్ నియమించకపోవడం శోచనీయమన్నారు. చనిపోతే ఎక్స్గ్రేషియా కార్మికులకు అందుతుంది.. కానీ ఈ వృత్తినే నమ్ముకున్న వారికి భరోసా మాత్రం ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని విమర్శించారు. కార్మికులను వివక్షతో కాకుండా సంక్షేమంతో ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మునుగోడు ఎన్నికల అనంతరం గీత బంధును వెంటనే ప్రభుత్వం ప్రకటించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బహిరంగసభలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరు బాలరాజు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు రాగీరు కృష్ణయ్య, గుండ్లపల్లి వెంకటేష్, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి, శిగ విజరు కుమార్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎరుకలి సుధా హేమేందర్ గౌడ్, రాజపేట మండల ఎంపీపీ గొపగాని బాలమణి, తదితరులు పాల్గొన్నారు.