Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛంద ముసుగులో నాసిరకం బువ్వ
- 113 పాఠశాలల్లో అక్షయపాత్ర భోజనం
- చప్పటి నీళ్లచారు.. చారులాంటి పప్పు
- గుడ్డు, రెండో కూర పెట్టని వైనం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
'పేరు స్వచ్ఛందం... ఆచరణ దుర్గంధం' ఇదీ అక్షయపాత్ర స్వచ్ఛంద ముసుగు. పసి పిల్లల ఆకలి తీర్చాల్సిన బాధ్యతను విస్మరించి నాసిరకం బువ్వ పెట్టి చేతులు దులిపేసుకుంటున్న వైనం. ఆకలి, అర్ధాకలితో బడిబాట పడుతున్న పేద పిల్లల నోటికాడి ముద్దను దోచుకుంటున్న తీరు అధ్వానం. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహణ అస్తవ్యస్తంగా మారింది. ఒకపూట బువ్వ కోసం అల్లాడుతున్న పసి హృదయాలకు నాసిరకం బువ్వ, కూరలు పెట్టి కడుపులు మాడుస్తున్నారు. సప్పటి నీళ్ల చారు.. చారులాంటి పప్పు.. కూర, గుడ్డు జాడేలేదు. పైగా పగిలిపోయిన ముద్దముద్ద బువ్వ పెట్టి చేతులు దులిపేసుకుంటున్న పరిస్థితి ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద ఒకపూట బువ్వ పెడుతున్నారు. బడిలో బువ్వ పెడతారనే ఆశ.. ఆకలి తీరుతుందనే దీమాతో బడికొచ్చిన విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి. తద్వారా బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండేలా చూడాలి. ఇందుకోసం సంగారెడ్డి జిల్లాలో 1,280 ప్రభుత్వ పాఠశాలల్లో 1,28,900 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకం అమలు కోసం ఏటా రూ.10.75 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని రెండు పద్ధతుల్లో అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ఏజెన్సీల ద్వారా, మరికొన్ని ప్రాంతాల్లో అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండగా... ఉన్న దాంట్లోనే నాణ్యమైన భోజనం పెట్టాల్సిన నిర్వాహకులు మెక్కుబడిగా నీళ్లచారు.. బువ్వ పెట్టి మమా అనిపిస్తున్నారు.
నీళ్లచారు.. చారులాంటి పప్పు
మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి విద్యార్థికీ బువ్వతో పాటు పప్పు, కూర, చారు, గుడ్డు, రక్షిత మంచినీరు అందించాలి. సంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించగా.. అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో 113 ప్రభుత్వ పాఠశాలల్లో 20,916 మంది విద్యార్థులకు అక్షయపాత్ర సంస్థ మధ్యాహ్న భోజనం అందిస్తోంది. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో బుధవారం భోజన సమయాన విద్యార్థుల కోసం తెచ్చిన భోజనాల్ని పరిశీలించగా.. అక్షయపాత్ర సంస్థ సిబ్బంది నాలుగు గిన్నెల్లో అన్నం, చారు, పప్పు తెచ్చారు. బడిగంట కొట్టగానే 300 మందికిపైగా విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని భోజనం కోసం ఎగబడుతూ క్యూ కట్టారు. పళ్లెంలో పెట్టిన ఆహార పదార్థాలను చూస్తే.. అన్నం పగిలిపోయి ముద్దలుముద్దలుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన సన్న బియ్యం ఇస్తున్నామని సర్కార్ చెబుతోంది. మధ్యాహ్న భోజనాన్ని చూస్తే మాత్రం రేషన్ బియ్యం కంటే అధ్వానంగా ఉంది. అందులో వేసిన పప్పు చారుకంటే పలుచగా ఉంది. ఇక చారైతే నీళ్లే అన్నట్లుగా ఉంది. వాటిల్లోనూ ఉప్పు, కారం లేదు. సాంబర్ అని పోస్తున్న చారు ఏదో వాసన వస్తుండటంతో పిల్లలు అన్నం తినట్లేదు. పప్పుతో పాటు ఏదైనా కూరగాయలతో చేసిన కూర పెట్టాలి. ఏనాడూ కూర పెట్టిన పాపానపోలేదని విద్యార్థులు వాపోయారు. గుడ్డు అసలే పెట్టట్లేదు. హాస్టల్ విద్యార్థులు, ఇండ్లలో ఆ మాత్రం బువ్వ దొరకని పిల్లలు ఏదో ఒకటి అంటూ తినేస్తున్నారు. మిగతా పిల్లలైతే భోజనం పట్టుకోవడమే లేదు. కొందరు ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం తింటున్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలల్లోనూ ఇదే తీరు కొనసాగుతోంది. ఆడపిల్లలు అన్నం బాగుందా లేదా అనేది చెప్పడానికే ఇబ్బంది పడ్డారు. ఏదో ఒకటి తింటున్నం అన్నట్టు స్పందించారు. ప్రతిరోజూ ఇదే రకమైన బువ్వ పెడుతుండటంతో పిల్లలు పెట్టిన దాంట్లో ఆకలి కోసం కొద్దిగా తింటున్న పరిస్థితి ఉంది. జిల్లాలోని నారాయణఖేడ్ ఇతర పాఠశాలల్లో మహిళా సంఘాల ఏజెన్సీల ద్వారా భోజనం పెడుతున్నారు. ఏజెన్సీలకు బిల్లులు ఇవ్వకపోవడంతో వాళ్లు సరుకులను ఉద్దెర తెచ్చి అప్పులపాలవుతున్నారు. దాంతో పిల్లలకు నాణ్యతలేని కూరగాయలు, గుడ్లు పెడుతున్నారు.
పర్యవేక్షణ పట్టని వైనం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి రోజూ నాణ్యమైన భోజనం పెట్టాలి. వండిన ఆహార పదార్థాలను ముందుగా హెచ్ఎం లేదా బాధ్యులైన ఉపాధ్యాయులు తిని రుచి చూడాలి. నాణ్యతా ప్రమాణాలు పరిశీలించాలి. రుచికరంగా ఉన్నాయా.. లేవా అనేది చూడాలి. నాణ్యమైన బువ్వ, పప్పు, కూర, సాంబారు, గుడ్డు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. స్కూల్కు వచ్చిన విద్యార్థుల్లో ఎంత మంది భోజనం చేస్తున్నారనే లెక్కలు చూడాలి. నాణ్యత పాటించకపోతే ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకునే విధంగా చూడాలి. ఇవేవీ ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనూ అమలు కావట్లేదు. వండి తెచ్చింది పెట్టిపోతున్నారు. విద్యార్థులు భోజనం బాగాలేదని అడిగితే మీ ఇంటికాడ ఇంతకంటే మంచి బువ్వ తింటున్నారా.. అంటూ బెదిరిస్తుండటంతో సర్దుకుపోతున్నామని విద్యార్థులు సురేష్, అవినాస్, చందు, భరత్ తెలిపారు.
నాసిరకం బువ్వ పెడుతుండ్రు
మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు నాసిరకం బువ్వ పెడుతుండ్రు. పేద పిల్లలే సర్కారు బడుల్లో చదువుతుండ్రు. పెడుతున్న ఆహార పదార్థాలు నాణ్యత లేకపోవడమే కాదు, వాసన వస్తున్నాయి. ఎప్పుడో చేసిన పదార్థాలను పిల్లలకు పెడుతున్నారు. గుడ్డు, కూర అసలే పెడ్తలేరు. పప్పు, చారు నీళ్ల మాదిరే ఉంటున్నరు. పేదరికం వల్ల పిల్లల్లో పౌష్టిహాకార లోపం అధికంగా ఉంది. వారికి నాణ్యమైన భోజనం పెట్టాలి. తినడానికే ఇష్టంలేని బువ్వ పెడితే ఏం లాభం. అక్షయపాత్ర, ఇతర ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా పెడుతున్నాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి.
- రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి