Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులతో సర్కారు చెలగాటం
- విద్యాశాఖ అధికారుల తీరుతో గందరగోళం
- నవంబర్ 1 నుంచి పరీక్షలు ప్రారంభం
- ఆరు పేపర్లతోనే వార్షిక పరీక్షలు : ఎస్సీఈఆర్టీ డైరెక్టర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. కరోనా మహమ్మారి వల్ల ఆన్లైన్, ఆఫ్లైన్ చదువులు సరిగ్గా లేక గత రెండు విద్యాసంవత్సరాల నుంచి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే తరగతులు సకాలంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఇప్పుడిప్పుడే పాఠ్యాంశాలపై దృష్టిసారిస్తున్నారు. పదో తరగతి అంటే అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు ఎంతో కీలకం. అలాంటిది పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పదోతరగతి విద్యార్థులకు ఎస్ఏ-1 పరీక్షల్లో ఆరు పేపర్లే ఉంటాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసన ఈనెల 13న ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడే ఆ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది. డీఈవోలు, ఇతర అధికారులు, ప్రధానోపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులకు అప్పటికే ఎస్ఏ-1 పరీక్షలకు సంబంధించి 11 పేపర్లతో కూడిన ప్రశ్నాపత్రాలను రూపొందించి ముద్రించారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండానే విద్యాశాఖ సంచాలకులు ఆరు పేపర్లే ఉంటాయని ప్రకటించారు.
దాని ప్రకారం డీఈవోలు, అధికారులు నిమగమై పనులు చేస్తున్నారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఎస్ఏ-1 పరీక్షల్లో ఆరు పేపర్లు కాదు 11 పేపర్లు ఉంటాయంటూ బుధవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ ఒకటి నుంచి ఏడో తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. అంటే గతంలో పదో తరగతి విద్యార్థులకు ఆరు పేపర్లతోనే ఎస్ఏ-1 పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రకటించినపుడు విద్యాశాఖలో సమన్వయలేమి ఏ స్థాయిలో కొరవడిందో అర్థమవుతున్నది. డీఈవోలతో సంప్రదించకుండానే పదో తరగతి విద్యార్థులకు ఆరు పేపర్లుంటాయని గతంలో ప్రకటించారు. ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణ ఇబ్బంది కావడం, 11 పేపర్లకు సంబంధించి గతంలోనే ముద్రించడంతో విద్యాశాఖ సంచాలకులకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఎస్ఏ-1 పరీక్షలు 11 పేపర్లతోనే ఉంటాయని ప్రకటించడం విమర్శలకు తావిస్తున్నది. జూన్ 13 నుంచి ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదు. పాఠశాలల్లో తరగతులు సైతం షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. అయినా విద్యాసంవత్సరం ప్రారంభమైన వెంటనే పదోతరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కానీ నాలుగు నెలల తర్వాత నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు సతమతమవుతున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుత్నుది. ఇంకోవైపు పదో తరగతి విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలు, ప్రీఫైనల్, వార్షిక పరీక్షలు మాత్రం ఆరు పేపర్లతోనే నిర్వహిస్తామని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఎస్ఏ-1 పరీక్షలను మాత్రమే 11 పేపర్లతో నిర్వహిస్తామని తెలిపారు.