Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముందు పరువు తీసిండ్రు
- 2 వేల మందికి కండువా కప్పితే గింతేనా వచ్చేది
- మొహం చూపొద్దంటూ మునుగోడు నేతలపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అగ్రహం
- కోమటిరెడ్డి తీరు నచ్చక టీఆర్ఎస్లో చేరిన కుడిభుజం గోవర్ధన్‌రెడ్డి
- మనోహర్‌రెడ్డి బ్యాచ్ టీఆర్ఎస్లోకి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు నియోజకవర్గంలో రోజురోజుకీ మారుతున్న రాజకీయంతో రాజగోపాల్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు కలిసిరాకపోగా పార్టీ మారటంపై అడుగడుగునా నిలదీస్తుండటం..మరోవైపు కోటి రూపాయలు పట్టుబడటం...ఇంకోవైపు మునుగోడు నడిగడ్డలో నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారానికి రెండొందల మంది కూడా లేకపోవడం..కండువాలు కప్పుకున్నోళ్లంతా మొహాలు చాటేస్తుండటం.. నమ్మినోళ్లు పార్టీ వీడుతుండటం వంటి పరిణామాలతో కోమటిరెడ్డి కోపం నషాలానికెక్కుతున్నట్టు కనిపిస్తున్నది. తన అనుంగ శిష్యులనే మొహం చూపొద్దంటూ చైర్లు విసిరేసి మరీ తీవ్ర అసహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాజగోపాల్‌రెడ్డి తీరు నచ్చక ఆయన అనుచరుడు గోవర్ధన్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిపోయారు. డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసుకున్నారు. మునుగోడు మండల కేంద్రంలో ఇటీవల కిషన్‌రెడ్డి ప్రచారాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. మునుగోడు చౌరస్తాలో కిషన్‌రెడ్డి ప్రసంగించే సమయంలో మూడొందల మంది కూడా లేరు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజగోపాల్‌రెడ్డి మంగళవారం ఉదయం తన అనుచరులను మునుగోడులోని ఎన్నికల క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుంచుకున్నారు. కుర్చీలు విసిరి తన అసహనాన్ని, కోపాన్ని ప్రదర్శించినట్టు బీజేపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. మునుగోడులో 2 వేల మందికి కండువాలు కప్పితే ప్రచారానికి రెండొందల మంది కూడా రారా? అంటూ చిర్రుబుర్రులాడినట్టు తెలిసింది.లంగలు..దొంగలు...అంటూ అడ్డగోలుగా, అనరాని మాటలు తిట్టినట్టు విశ్వసనీయ సమాచారం. మునుగోడు వ్యవసాయ ప్రాథమిక సహకారం సంఘం చైర్మెన్, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షులు గోవర్దన్రెడ్డిని తన ఇంటి నుంచి వెళ్లిపోండి..మళ్లీ మొహం చూపొద్దు అంటూ వేలెత్తి హెచ్చరించినట్టు కూడా ప్రచారం జరుగుతున్నది. అన్నీ తానై అండగా ఉంటానని తన వెంట తిప్పుకున్న రాజగోపాల్‌రెడ్డి ఇలా చేయటంపై అనుచరులు లోలోన కుమిలిపోయారు. ఆ నేతలిద్దరూ తమకు జరిగిన ఘోర అవమానాన్ని సన్నిహితుల వద్ద చెప్పుకుని మదనపడ్డారు. 'నా రాజకీయ జీవితాన్ని రాజగోపాల్‌రెడ్డి నడిరోడ్డున పడేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మంచిగుండేది. ఇప్పుడు అక్కడకు పోయి మొహం చూపించలేను. టీఆర్ఎస్లో అందరూ ఫుల్ అయిపోయారు. ఆ పార్టీలో చేరినా సముచిత స్థానం దక్కుతుందో లేదో అన్న భయముంది. రాజగోపాల్‌రెడ్డి అన్న మాటలతో నోట్లకు ముద్ద కూడా దిగట్లేదు' అంటూ పార్టీకి చెందిన మరో కీలక నేత వద్ద గోవర్ధన్‌రెడ్డి తన గోడును వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ నేతలకూ తన సాదకబాధకాలను చెప్పుకున్నారు. అతని రాజకీయ భవిష్యత్‌కు హామీనిస్తామంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి నచ్చజెప్పడంతో టీఆర్ఎస్ పార్టీలో గోవర్ధన్‌రెడ్డి చేరిపోయారు. రాజగోపాల్‌రెడ్డికి అత్యంత నమ్మకస్తులకే ఇలా జరగటంపై ఆ నియోజకవర్గంలో చర్చ నడుస్తున్నది. వారికే ఇలా జరగటంపై బీజేపీ కార్యకర్తలు కూడా విస్తుపోతున్నారు. దీంతో పాటు మునుగోడు మండలం చల్మెడ గ్రామం వద్ద ఇటీవల పట్టుబడ్డ కోటి రూపాయల సమాచారాన్ని పోలీసులకు ఎవరు ఉప్పందించారు? దీని వెనుక ఎవరెవరి హస్తముంది? టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి చేర్చుకున్న వారే సమారమిచ్చారా? మొదటి నుంచీ తన రాకను వ్యతిరేకిస్తున్న పాత బీజేపీ నేతలు గోతులు తీస్తున్నరా? అని ఆరా తీసినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే సందర్భంగా పెద్ద ఎత్తున మూటలతో ప్రజల్లోకి వెళ్లి డబ్బు రాజకీయం చేసిన రాజగోపాల్‌రెడ్డికి అననుకూల పవనాలు వీస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక తన అనుచర గణాన్నే దూరం చేసుకుంటున్నారనే విమర్శ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నది.
మనోహర్‌రెడ్డి బ్యాచ్ టీఆర్ఎస్లోకి...
మనోహర్‌రెడ్డి బ్యాచ్ మొత్తం బీజేపీని వీడుతున్నది. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో రాజగోపాల్‌రెడ్డి తీరు నచ్చక మునుగోడు నియోజకవర్గానికి జిల్లా స్థాయి నేతలు కూడా ఆ పార్టీని వీడుతుంటం రాజగోపాల్‌రెడ్డికి తీవ్ర భంగపాటే. బీజేపీ మునుగోడు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి బండారు యాదయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని నరేందర్రెడ్డిగౌడ్, మైనార్టీ మోర్చా నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎమ్డీ మాజిద్, మర్రిగూడెం మాజీ ఎంపీపీ అనంతరాజుగౌడ్, బీజేవైఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి పల్లా రాజేశ్, దళిత మోర్చా మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి ఎం. రాజారాం, దళితమోర్చా జిల్లా అధ్యక్షులు రాజ్యలక్ష్మి, జి.రమేశ్, అంజిరెడ్డి, చండూరు మాజీ ఎంపీటీసీ తిరందాసు అనిత ఆంజనేయులు, శేరిగూడెం ఉపసర్పంచ్ పి.వెంకటేశ్ యాదవ్‌లతో చాలా మంది పువ్వుపార్టీకి బైబై చెప్పేశారు. వీరిలో ఎక్కువ మంది మనోహర్‌రెడ్డి అనుచరులు. బీజేపీ హార్డ్‌కోర్ కార్యకర్తలుగా ముద్ర పడి ఉంది. రాజగోపాల్‌రెడ్డి లాంటి వ్యక్తి తమ పార్టీలోకి రావటాన్ని ఆ పార్టీ శ్రేణులే జీర్ణించుకోలేని పరిస్థితి ఉందని దీనిని బట్టే తేటతెల్లం అవుతున్నది.
బీజేపీలోకి బూర రాక.. బూడిద జంప్
మునుగోడు ఉప ఎన్నికలో తన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయకపోవడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. గౌడ సామాజిక తరగతి మొత్తం ఇక తన వెంటే వస్తుందనే అతి విశ్వాసంతో ముందుకెళ్లిన బీజేపీకి ఆయన చేరిక మరింత నష్టం చేకూర్చుతున్నది. భవిష్యత్‌లో ఆలేరు టికెట్ లభిస్తుందనే ఆశతో బీజేపీలో చేరిన బూడిద భిక్షమయ్యగౌడ్ ఆ పార్టీకి ఇప్పుడు రాంరాం చెప్పేశారు. బూర తనకు భువనగిరి పార్లమెంట్ స్థానంగానీ, భువనగిరి, మునుగోడు ఎమ్మెల్యే స్థానం గానీ కేటాయించాలనే విజ్ఞప్తిని బీజేపీ అధిష్టానం కొట్టిపారేసింది. ఆ రెండు టికెట్టూ కోమటిరెడ్డి బ్రదర్స్‌కు హామీనిచ్చినట్టు బీజేపీ అధిష్టానం తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. భువనగిరి ఎమ్మెల్యే స్థానం కోసం ఇప్పటికే జిట్టా బాలకృష్ణారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి మధ్య పోరు నడుస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ స్థానంపైనా ఆయనకు గ్యారంటీ ఇవ్వలేదు. ఆలేరు నుంచి పరిశీలిస్తామని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. మొదటి నుంచీ కోమటిరెడ్డి బ్రదర్స్‌తో ఇబ్బంది పడ్డ బూడిద...వారు బీజేపీలోకి వస్తే తన భవిష్యత్‌కు కష్టమేనని భావించారు. ఈ నేపథ్యంలో కారెక్కేశారు.