Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబీకుల ఆందోళన.. కళాశాల దగ్గర ఉద్రిక్తత
- అస్వస్థతకు గురైన ప్రిన్సిపల్
- ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
నవ తెలంగాణ- జడ్చర్ల
విద్యార్థినుల మధ్య జరిగిన చిన్న గొడవ.. లెక్చరర్ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్యకు దారితీశాయి. దాంతో కుటుంబీకులు, ప్రజాసంఘాల నేతల ఆందోళనతో కళాశాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం హనుమాన్‌తండాలో బుధవారం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న మైనకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు గురువారం జడ్చర్ల పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల ప్రకారం..
హనుమాన్ తండాకు చెందిన మునావత్ మైన(18) డాక్టర్ బీఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో బీజెడ్సీ సెకండ్ ఇయర్ చదివేది. మైనకు లావణ్య, దేవయాని స్నేహితులు ఉన్నారు. వీరిలో ఓ యువతికి పెండ్లి అయింది. అయితే, ఇటీవల పెండ్లి అయిన యువతితో కళాశాలలో ఒక యువకుడు మాట్లాడుతుండగా మైన ఫొటోలు తీసింది. వాటిని యువతి భర్త స్నేహితుడికి వాట్సప్ ద్వారా పంపినట్టు సమాచారం. ఈ విషయంలో భార్యాభర్తలు ఇంటిదగ్గర గొడవ పడ్డారు. మైన ఇలా చేసిందని సదరు యువతి మరో స్నేహితురాలితో చెప్పడంతో.. ఆమె మైనను నిలదీసింది. ఈ క్రమంలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఈ ముగ్గురు స్నేహితులు గొడవ పడుతున్న సమయంలో క్లాస్‌రూమ్‌లో కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారు. దాంతో మనస్తాపానికి గురైన మైన బుధవారం ఉదయం ఇంటి దగ్గర పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున చనిపోయింది. విద్యార్థినుల గొడవ విషయాన్ని తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేదంటూ ప్రిన్సిపల్‌ను బాధితులు నిలదీశారు.
మరోవైపు కళాశాల లెక్చరర్ శ్రీనివాసరావు మైనతో తప్పుగా ప్రవర్తించారని, అతని వేధింపులు కూడా ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాయని కుటుంబీకులు ఆరోపించారు. మైన స్నేహితులను, లెక్చరర్ శ్రీనివాసరావును పిలిపించే వరకు కదిలేది లేదని కళాశాల ఎదుట భీష్మిచుకు కూర్చున్నారు. మరోవైపు స్నేహితురాళ్ల గొడవను వీడియో తీసిందెవరనేది తెలియరాదు. కానీ ఆ వీడియోను కళాశాలలో పని చేస్తున్న మరో లెక్చరర్ సోషల్ మీడియాలో పెట్టించినట్టు ఆరోపణలొచ్చాయి.
ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
మైన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అప్పియ చిన్నమ్మ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను అక్కడే ఉన్న కొందరు పూర్వ విద్యార్థులు ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. బాధితులకు నచ్చజెప్పేందుకు ఆర్డీవో అనిల్ కుమార్ ప్రయత్నించినా వినకపోవడంతో.. పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. విద్యార్థి సంఘాల నాయకులను స్టేషన్‌కు తరలించారు. విద్యార్థిని మైన కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన జడ్చర్ల నాయకులు ప్రభు డిమాండ్ చేశారు. విద్యార్థిని పట్ల అమానవీయంగా ప్రవర్తించిన లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.