Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీత వృత్తి పరిరక్షణ,ఉపాధి కోసం ఉద్యమాలు : చేతి వృత్తిదారుల సమన్వయ సమితి గౌరవాధ్యక్షులు చెరుపల్లి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
వృత్తిదారుల ఐక్య పోరాటాలతో కల్లుగీత వృత్తిపై సమగ్రపాలసీ సాధ్యమవుతుందని చేతి వృత్తిదారుల సమన్వయ సమితి గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని శ్రీలక్ష్మిగార్డెన్లో కెేజీకేఎస్ రాష్ట మహాసభ రెండో రోజు గురువారం జిల్లా కార్యదర్శి బోలగాని జయ రాములు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తిపై ఆధారపడి దాదాపు 2.50 లక్షల మంది జీవిస్తున్నారన్నారు. వారికి వృత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించి సొసైటీలకు భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట గౌరవాధ్యక్షుడు కల్లేపు వెంకటయ్య మాట్లాడుతూ.. గీత వృత్తిలో ప్రమాదానికి గురై చనిపోయిన కార్మికుల కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు రూ.10 లక్షల, తాత్కాలిక వికలాంగులైన వారికి లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. ఎక్స్‌గ్రేషియాకు మెడికల్ బోర్డు విధానం తొలగించాలని, వృత్తి చేస్తూ చనిపోయిన వారి పిల్లలకు ఉచిత విద్య, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పింఛన్ రూ.5 వేలు ఇవ్వాలని కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించాలని కోరారు.
కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి. రమణ మాట్లాడుతూ.. కల్లులోని పోషకాలను, ఔషధ గుణాలపై ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. కల్లు గీత కార్పొరేషన్ నుంచి ఇస్తున్న తక్షణ సహాయం పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సభలో చేతి వృత్తిదారుల సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పైళ్ల ఆశయ్య, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు శిగా విజరు కుమార్‌గౌడ్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎరుకలి సుధా హేమందర్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ చైర్మెన్ తాళ్లపల్లి రామస్వామి గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరు బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.