Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొల్లకురుమలకు నగదు బదిలీని అడ్డుకున్నందుకు నిరసన
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
గొల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నగదు బదిలీ పథకాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గొల్ల, కురుమలు, టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నేతల దిష్టిబొమ్మలు దహనం చేశారు. నగదు బదిలీ డబ్బులను తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. యాదవ సంఘం అధ్యక్షులు గుండెబోయిన అయోధ్యయాదవ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆలేరు పట్టణకేంద్రంలో గొర్ల కాపరుల సంఘం జిల్లా డైట్ డైరెక్టర్ జల్లి నరసింహులు, కురుమ సంఘం పట్టణ అధ్యక్షులు ఎగ్గిడి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చిత్రపటాలను దహనం చేశారు.
బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గొల్ల కురుమల సంఘం ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు లోడంగి గోవర్ధన్, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ మాట్లాడారు. గొల్ల కురుమలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే అడ్డుపడటం సిగ్గుచేటని విమర్శించారు. గొల్ల కురుమ సంఘాల ఆధ్వర్యంలో గట్టుప్పల మండల కేంద్రంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.