Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ సంస్థలను అడ్డు పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తోంది..
- అవన్నీ బీజేపీ అనుబంధ సంఘాలుగా మారాయి
- రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
- టీఆర్ఎస్ గూటికి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడులో ధనమదంతో గెలిచేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందనీ, తద్వారా అది రాష్ట్రంలో ఒక విష సంస్కృతికి తెరలేపిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజాబలంతో గెలవలేని ఆ పార్టీ... రాజ్యాంగ సంస్థలను అడ్డు పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యముంటే తెలంగాణ ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పిన తర్వాతే మునుగోడులో ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
బీజేపీ నాయకుడు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్... గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బీజేపీ హయాంలో దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా గ్యాస్ ధరలు మనదేశంలోనే పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార భద్రతా సూచీలో అట్టడుగు స్థానానికి భారత్ చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే మోడీ సాధించిన ఘనతలంటూ ఎద్దేవా చేశారు. అందువల్ల ఆ పార్టీకి ప్రజలంతా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 2016లో కేంద్ర ఆరోగ్య మంత్రి హోదాలో నల్లగొండలో పర్యటించిన నడ్డా... అక్కడి మర్రిగూడాలో కరోనా రీసెర్చి సెంటర్, ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారని గుర్తు చేశారు. ఆ సంగతి ఏమైదంటూ ప్రశ్నించారు.
ప్రస్తుతం దేశంలోని రాజ్యాంగ సంస్థలన్నీ కేంద్రం చేతిలో కీలు బొమ్మలుగా మారాయని కేటీఆర్ ఈ సందర్భంగా విమర్శించారు. అవన్నీ బీజేపీ అనుబంధ సంఘాలుగా మారిపోయాయనీ, అందువల్ల ఆ మేరకు పేర్లు మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. రాజగోపాల్‌రెడ్డిది చాలా చిన్న కాంట్రాక్టు కంపెనీ... అలాంటి కంపెనీకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయో చెప్పాలంటూ ప్రశ్నించారు. అందులో దాగున్న గుజరాత్ గూడుపుఠాని ఏమిటో చెప్పాలని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్... కోవర్టు రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలుంటాయన్న సామెతను బూర నర్సయ్య గౌడ్ నిజం చేశారని చురకలంటించారు. గ్రహచారం బాగాలేకే ఆయన పార్టీ మారారంటూ విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసీ తీరు ఆక్షేపణీయం...
మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) తీరు ఆక్షేపణీయమని కేటీఆర్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను బీజేపీ ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నదనే దానికి ఈ చర్య ప్రత్యక్ష ఉదాహరణని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దంపట్టే విధంగా వ్యవహరించాల్సిన ఈసీపై... బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తుకు తిరిగి ఇప్పుడు మళ్లీ స్థానం కల్పించటమనేది ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయటమే అవుతుందని తెలిపారు. ఇది ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్‌పై ఈసీ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.