Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థాన్, చండూరులో కలకలం
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం/చండూరు
ఓటు అమ్ముకుంటే శవంతో సమానం.. అంటూ జైభారత్ పేరుతో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో యాదాద్రిభువనగిరి జిల్లా నారాయణపురం, చండూరు మండలాల్లో గురువారం ఈ పోస్టర్లు వెలిశాయి. 'వాడు వందల కోట్లు నొక్కేస్తున్నాడు.. అది మన డబ్బే! వాడు దేశాన్ని అమ్మేస్తున్నాడు,.. ఇది మన దేశమే! వాడు ఇచ్చిన గుప్పెడు నోట్లు తీసుకుని ఓటుని అమ్ముకున్నాక ఇక వాడ్ని మనం ఎలా నిలదీయగలం? దొంగల నుంచి లంచం తీసుకుని ఓట్లు అమ్ముకోవడానికి మనకి సిగ్గులేదా?? ఓటును 'అమ్ముకోవద్దు! సంక్షేమం, సామరస్యం, సామాజిక న్యాయం, అభ్యుదయం, నీతి, అర్హత, నిబద్ధత, సమర్థత వివేచించి ఓటు వేద్దాం! దేశాన్ని మార్చుకుందాం!! నోట్లకి, మద్యానికి ఐదేండ్ల భవిష్యత్తును అమ్మిన మనిషి బతికున్న శవంతో సమానం'' అని ముద్రించిన రెండు వాల్ పోస్టర్లు గురువారం ఉదయం దర్శనమిచ్చాయి.
జై భారత్ (రాజకీయేతర దేశభక్తియుత విప్లవ వేదిక) పేరుతో వెలసిన ఈ వాల్ పోస్టర్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీని ఉద్దేశించి వేసినట్టుగా పలువురు చర్చించుకుంటున్నారు. గతంలోనూ ఇదే రాజగోపాల్ రెడ్డి ఫొటోతో కొన్ని వాల్ పోస్టర్లు వెలిశాయి. అవి ఎవరేసారన్నది స్పష్టత లేదు. కాగా, ఈ వాల్ పోస్టర్లను గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించేస్తున్నారు. చండూరు మున్సిపల్ కేంద్రంలోనూ పలుచోట్ల 'ఓటు అమ్ముకోవద్దు..' అంటూ ఆయా చోట్ల గోడలపై, చిన్న చిన్న డబ్బాలఫై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. పోస్టర్లు చూసి ఓటర్లు ఆశ్చర్యపోయారు. మున్సిపల్ సిబ్బంది చూసి వాటిని తొలగించారు.