Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తనకు ఆస్పత్రిలో సర్జరీలతో పాటు పొలిటికల్ సర్జరీలూ చేయొచ్చని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన తొలిసారి వచ్చారు. ఆయనకు పార్టీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కొల్లి మాధవి, శాంతి కుమార్ ఆహ్వానం పలికారు. అనంతరం బూర నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడారు. డాక్టర్‌గా కొనసాగుతూనే ఉద్యమంలో కీలక పాత్ర పోషించానన్నారు. టీఆర్ఎస్ నుంచి గెలిచినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో భువనగిరిని ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు.
కేసీఆర్‌ది నియంతృత్వ పాలన అని విమర్శించారు. బీజేపీ ఉద్యమ నేతల పార్టీగా మారితే..టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్న పార్టీగా మారిందని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రగతిభవన్‌కి వెళ్లాలంటే వీసా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. మునుగోడు ఉపఎన్నికకు అధికార పార్టీ పెడుతున్న ఖర్చును అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ పెట్టి ఉండరని విమర్శించారు. ఉప ఎన్నిక తర్వాత బీజేపీలోకి చేరికలు వరదలా ఉంటాయన్నారు. ఇప్పుడున్న అధికారులు చాలామంది జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పోయిందని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారనీ, అక్కడ అధ్యయన కేంద్రం ఎందుకని ప్రశ్నించారు. 2003లోనే శ్రీశైలం నుంచి నల్లగొండకు నీరు తెచ్చారనీ, దానికి కేసీఆర్ పేరు మార్చి తానే తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.