Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా విజయాన్ని సాధించడం కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలోపేతమవుతున్నందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోయే ఘట్టమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, జాతీయ నేత నదీమ్ జావిద్, వినోద్ కుమార్, అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువగా విజయవంతమవుతుందని ఉత్తమ్ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలోని అనేక వర్గాలతో రాహుల్ సమావేశమవుతారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. 23న రాహుల్ యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అనేక మంది కలవనున్నారని చెప్పారు. రైతు సమస్యలు, పోడు భూములు, నిరుద్యోగ సమస్యలపై రాహుల్ మాట్లాడుతారని తెలిపారు.
బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నాయి
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం అయ్యేలా వ్యవహరిస్తున్నాయని ఉత్తమ్ విమర్శించారు. మునుగోడులో మద్యం, డబ్బు ప్రభావంతో గెలవాలని ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఈసీ చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్ని అవకతవకలు జరిగినా ఎన్నికల సంఘం పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రజలను నుంచి ఆపార్టీలు దోచుకున్న సోమ్మునే ఉప ఎన్నికల్లో పంచుతున్నాయని చెప్పారు.
భారత్ జోడో యాత్ర కోసం ఎదురుచూస్తున్నారు: ఏలేటి
భారత్ జోడో యాత్ర కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. 60 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన మహా నేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని తెలిపారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నేత చేయని విధంగా రాహుల్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు.