Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ వ్యక్తికి ఇంజెక్షన్ వేసి పరారైన దుండగులు
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
నవతెలంగాణ-ఇచ్చోడ
ఖమ్మంలో జరిగిన ఇంజెక్షన్ ఘటనల తరహాలోనే ఆదిలాబాద్‌లోనూ ఓ వ్యక్తికి ఇద్దరు దుండగులు ఇంజెక్షన్ వేసి పరారయ్యారు. ఈ ఘటన గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో కలకం సృష్టించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
హరినాయక్తండాకు చెందిన జాదవ్ శ్రీకాంత్(27) పక్కనే ఉన్న నర్సాపూర్ గ్రామంలోని కిరాణా షాప్‌కు వెళ్లాడు. అదే సమయంలో హెల్మెట్లు పెట్టుకుని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చారు. శ్రీకాంత్ చేతులను ఒకరు పట్టుకోగా, మరొకరు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే మత్తు వచ్చింది. వెంటనే బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. గ్రామస్తులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకునే సరికే శ్రీకాంత్ స్పృహ లేకుండా పడిపోయాడు. వెంటనే 108 వాహనంలో బాధితున్ని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. శ్వాసలో ఇబ్బందిగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. దుండగులు ఎవరు? ఎందుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారనేది తెలియరాలేదు.