Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడుకు కాబోయే ఎమ్మెల్యే కూసుకుంట్ల
- బీజేపీ మతం పేరుతో చిల్లర రాజకీయాలు
- కమ్యూనిస్టుల మద్దతు అభినందనీయం
- మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడులో నవంబర్ 6న కాబోయే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అని, రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే బీజేపీకి కోవర్టుగా పనిచేశారని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. బతుకమ్మలు, బోనాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రోడ్డు షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
మునుగోడులో బీజేపీకు డిపాజిట్ దక్కకుండా చేయాలన్నారు. 2018లో మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ గెలిపిస్తే.. బీజేపీ పాట పాడారని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా రాజగోపాల్‌రెడ్డి బీజేపీ కోవర్టుగా పనిచేశాడని ఆరోపించారు. మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం చూపించే మిషన్ భగీరథకు 19వేల కోట్లు ఇవ్వాలని నిటి అయోగ్ సూచిస్తే కేంద్రంలో మోడీ పైసా ఇవ్వలే.. కానీ సొంత లాభం కోసం పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డికి మాత్రం 18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని, దీన్ని ప్రజలే ఆలోచించాలన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజలను అంగడి సరుకుగా కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి ఒక్క పనైనా చేసిండా ? ఒక్క గ్రామానికైనా వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండా ? అని ప్రశ్నించారు. డబ్బు, ధనదాహంతో వస్తున్న రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల మోడీ ప్రభుత్వంలో 400 రూపాయలు ఉన్న గ్యాస్‌ను మూడు రెట్లు పెంచి రూ.1200 చేశారని విమర్శించారు. మహిళలకు కట్టెల పొయ్యి దిక్కు చేశారని, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి డిపాజిట్ దక్కకుండా చేయాలని కోరారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు పదకొండున్నర లక్షల కోట్లు మాఫీ చేసింది కానీ, సామాన్య రైతులకు మాత్రం రుణమాఫీ చేయలేదని విమర్శించారు. చేనేతకు మొట్టమొదటగా పన్ను వేసిన మొదటి ప్రధాని మోడీ అన్నారు.
బీజేపీని తరిమికొట్టేందుకు కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. బీజేపీ మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ధాన్యానికి మద్ధతు ధర కల్పిస్తున్నామన్నారు. దేశంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మిషన్ భగీరథ ద్వారా మునుగోడులో ఫ్లోరోసిస్‌ను పూర్తిగా రూపుమాపింది కేసీఆరేనన్నారు. ఈ సందర్భంగా జ్యోతిర్మయి అనే చిన్నారి తాను దాచుకున్న గల్లగురిగిలోని డబ్బును ఎన్నికల ఖర్చు కోసం కేటీఆర్‌కు అందజేశారు.
దేశానికి తెలంగాణ ఆదర్శం : మంత్రి జగదీశ్‌రెడ్డి
అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వచ్చిందని, కానీ మునుగోడులో 18వేల కోట్ల కాంట్రాక్టుకు బీజేపీకి రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు.
రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలి : సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి
18వేల కోట్ల కాంట్రాక్టు కోసం బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డి గెలిచి ఈ ప్రాంత అభివృద్ధిని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కారు గుర్తుకు ఓట్లు వేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రోడ్‌షోలో ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.