Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టులు బలపర్చిన అభ్యర్థిపై ప్రత్యర్థి ఎవరైనా గెలవలేరు
- 40 వేల మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం
- బీజేపీకి ఎదురుదెబ్బే.. : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ -మునుగోడు
బీజేపీ చేసిన ఎత్తుగడను మునుగోడు నియోజకవర్గంలో చిత్తు చేసి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రజలు తీర్పు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తమ్మినేని అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకమైందని, రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎన్నికలో 40 వేల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరకముందు ఉన్న బీజేపీ నేతలు, నాయకులు ప్రస్తుతం ప్రత్యామయం వెతుక్కుంటున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. మునుగోడులో బీజేపీ వేసిన ఎత్తుగడ ఫలించలేదని, దానికే ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పారు. మతోన్మాద బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ చైతన్యం ప్రదర్శిస్తున్న నియోజకవర్గ ప్రజలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తరపున అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ నేతలు తమకు వచ్చే ఓటును కూడా వమ్ము చేసుకుంటున్నారన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి.. బీజేపీలో ఉన్న తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఒక ఓటర్‌కు ఫోన్ చేయడంతోపాటు తానే పీసీసీ అధ్యక్షుడిని కాబోతున్నానని చెప్పుకుంటున్న పరిస్థితి ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలని సూచించారు. నిబద్ధతగా పనిచేసే కమ్యూనిస్టులపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు నోరు పారేసుకున్నారని విమర్శించారు. వారి తప్పులు వారి వద్ద ఉంచుకొని ఎదుటివారిపై దాడులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కమ్యూనిస్టు, టీఆర్ఎస్ ఐక్యతతో నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తుందన్నారు. కమ్యూనిస్టులు బలపరిచిన అభ్యర్థిపై ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా గెలవలేడన్న మాట ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు.
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం కారుచౌకగా ప్రయివేటీకరణ చేసిందన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని, దీంతో దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని చెప్పారు. దేశంలో హిట్లర్ రాజకీయాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. దేశభక్తి ముసుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మతోన్మాద, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేయడంలో భాగంగానే టీిఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మకాం వేసేందుకు.. దక్షిణ తెలంగాణలో బలం పెంచుకోవాలన్న దురుద్దేశంతోనే బీజేపీ పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి రాజీనామా చేయించి ఉపఎన్నిక తెచ్చారని విమర్శించారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ తమకు ప్రథమ శత్రువని, దాన్ని ఓడించడమే తక్షణ రాజకీయ అవసరమని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటికి కేటాయించాల్సిన బడ్జెట్‌ను దశలవారీగా తగ్గిస్తూ నష్టాల పేరుతో ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాలను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు జరపాలని, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, చిన్నపాక లక్ష్మీనారాయణ, మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్ తదితరులు పాల్గొన్నారు.