Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 4,5 తేదీల్లో హైదరాబాద్లో.. ఎస్వీకేలో లోగో ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత మధ్యాహ్న భోజన కార్మికుల ఫెడరేషన్ (ఎండీఎండబ్ల్యూఎఫ్ఐ) అఖిల భారత రెండో మహాసభలు వచ్చేనెల 4,5 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయి. ఆ మహాసభలకు సంబంధించిన లోగోను సీఐటీయూ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు పి రాజారావు, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టి చక్రపాణి, ప్రధాన కార్యదర్శి ఎస్వి రమ, ఉపాధ్యక్షులు సిహెచ్ ప్రవీణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు సునీత, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు వై సోమన్న శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతారని చెప్పారు. రాష్ట్రంలో తక్కువ ఆదాయంతో కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కేవలం రూ.వెయ్యి పారితోషికం మాత్రమే చెల్లిస్తున్నదనీ, అతితక్కువ గౌరవవేతనంతో ఎలా బతకాలని ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో పాఠశాలలు మూతపడ్డాయని చెప్పారు. వారికి ఉపాధి లేక, జీతాలు రాక మనోవేదనకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తర్వాత పాఠశాలలు ప్రారంభమైనా మూడు, నాలుగు, ఐదు నెలలపాటు బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. అభ్యదయవాదులు, ప్రజాతంత్రవాదులు ఈ మహాసభలకు సంఘీభావంగా ఆర్థికంగా, హార్దికంగా అన్ని రకాలుగా తోడ్పాటునందించాలని కోరారు. చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మార్చి నుంచి తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు గుడ్డు బిల్లులు చెల్లించడం లేదనీ, సుమారు రూ.వంద కోట్లు బకాయిలున్నాయని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలనీ, బకాయిల్లేకుండా సకాలంలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్వి రమ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఈ మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ పోరాటాలను రూపకల్పన చేస్తామన్నారు.