Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య సదుపాయాలు, సిబ్బందిని నియమించండి
- బాసర త్రిపుల్ఐటీ వీసీకి మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాసరలోని త్రిపుల్ఐటీ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఆ వివరాలను డిజిటలైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యవంతమైన జీవనానికి ముందడుగు పడినట్లవుతుందని వివరించారు. ఇందుకోసం అవసరమైన వైద్య సదుపాయాలను, వైద్య సిబ్బంది నియామకాలను వెంటనే చేపట్టాలని బాసర త్రిపుల్ఐటీ వైస్ ఛాన్సలర్ (వీసీ)ని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల నుంచి ఆరోగ్య వివరాలు సేకరించడంతోపాటు 18 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సహకారంతో 6,500 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని వివరించారు. వారిలో 1,200 మంది విద్యార్థులకు దృష్టి లోపాలు, కంటి సమస్యలున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. వారికి అవసరమైన కళ్లద్దాలను శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో కొందరు విద్యార్థులకు ఆమె అందజేశారు. 600 మంది విద్యార్థులకు ఎనీమియా ఉందని గుర్తించి వారికీ అవసరమైన మందులను అందజేయనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు నిర్ణీత కాలానుగుణంగా పరీక్షలను నిర్వహిస్తూ వాటి ఫలితాలను ప్రత్యేక పోర్టల్లో నిక్షిప్తం చేయనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, బాసర త్రిపుల్ఐటీ వీసీ వి వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.