Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ కారెక్కారు.. టీఆర్ఎస్లోకి స్వామిగౌడ్ దాసోజు శ్రవణ్
నవతెలంగాణ-తుర్కయాంజల్
తెలంగాణ రాష్ట్ర తొలి శాసనమండలి మాజీ చైర్మెన్, బీజేపీ నేత స్వామిగౌడ్, ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయకుడు దాసోజు శ్రవణ్ తిరిగి సొంతగూటికి చేరారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, మన్నెగూడలోని సార్థ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో వారు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమకారులైన ఇద్దరు నేతలు బీజేపీ విధానాలు నచ్చక తిరిగి టీఆర్ఎస్లో చేరడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్
అన్నారు. అనంతరం స్వామిగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సబ్బండ వర్గాలు కేసీఆర్‌తో కలిసి పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాయని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరిస్తుందనే ఆశతోనే బీజేపీలో చేరామని, సంవత్సర కాలం ఎదురు చూశామని, విభజన సమస్యలను ఎన్నిసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే బీజేపీకి రాజీనామా చేశామన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నదని, సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్తో జలాల పంపిణీ, వాటా సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకుండా తమతో కలిసి పనిచేయాలని కేటీఆర్ కోరారని తెలిపారు.శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. తనకు రాజకీయ, సామాజిక అస్తిత్వం ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఎన్నో ఆశలతో బీజేపీలో చేరామని, కానీ అది కేవలం కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారుల పార్టీ అని విమర్శించారు.
బీజేపీతో అభివృద్ధి జరగదని, దానివల్ల ప్రజలకు మేలు జరగదని, అందుకే టీఆర్ఎస్లోకి తిరిగి వచ్చానని చెప్పారు. కేసీఆర్‌కు అండగా ఉంటూ పనిచేస్తామన్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో ఉంటూ దేశ సమగ్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జీవన్‌రెడ్డి, నాయకులు సాయిచంద్, బి.మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.