Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
- బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి: రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి
నవతెలంగాణ- తాడ్వాయి
పోడు భూముల సర్వే అనంతరం మళ్లీ తన భూమిని సర్వే చేయిస్తుండటంతో భూమి దక్కుతుందో లేదోనని ఆందోళనకు గురైన పోడు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని నాంపల్లి బంజర గ్రామంలో జరిగింది. దాంతో రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి..
బంజర గ్రామానికి చెందిన ఎల్లబోయిన నర్సింగరావు 20 సంవత్సరాల నుంచి పోడు వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల ఆయన భూమిని అధికారులు సర్వే చేశారు. కానీ, కొందరు రైతుల వల్ల ఎఫ్ఆర్సీ కమిటీ, సర్పంచ్‌లు కలిసి తిరిగి రీ సర్వే చేస్తున్నారు. ఇది చూసిన నర్సింగరావు.. తన భూమి తనకు దక్కదేమోనని ఆందోళనకు గురయ్యాడు. గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలియడంతో శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో తాడ్వాయి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. రైతు నర్సింగరావు కుటుంబానికి న్యాయం చేయాలని, అతని భూమిని అతనికే ఇవ్వాలని, అక్రమ సర్వేను ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ముల్కనూరు శ్రీనివాస్‌కు, స్థానిక పోలిస్స్టేషన్లలో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తాడ్వాయి మండలంలోని నాంపల్లిలో 2002 కంటే ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామాన్ని ఏర్పాటు చేసుకొని 20 కుటుంబాలు పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. అనేక కష్టాలు, వ్యయ ప్రయాసలకు ఓర్చి గ్రామం నిలబెట్టుకుని పోడు వ్యవసాయం చేసుకుంటుంటే.. ఆ భూమిని ఎఫ్ఆర్సీ కమిటీ ఆధ్వర్యంలో సర్వే చేశారన్నారు. అయితే, ఈ భూమిలో తాము గతంలో చెట్లు కొట్టామని చెప్పుకుంటూ గంగారం కాలనీకి చెందిన కొందరు రైతులు సర్పంచ్ ఆధ్వర్యంలో అక్రమంగా రీ సర్వే చేయిస్తున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్లబోయిన నర్సింగరావు ఆత్మహత్యాయత్నం చేసు కున్నారని చెప్పారు. 20 ఏండ్ల నుంచి ఏ రోజు కూడా గంగారం రైతులు ఆ భూముల దగ్గరకు రాలేదని, సాగు చేయలేదని తెలిపారు. ఈ రోజు అధికారులకు డబ్బు ఆశ చూపి అక్రమంగా సర్వే చేయించుకుని పట్టా పొందేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటవీ హక్కు చట్ట ప్రకారం ఏ గిరిజనుడైతే కాస్తులో ఉన్నాడో వారికి మాత్రమే హక్కు పత్రాలు వస్తాయన్నారు. కానీ, అధికారులు నిజమైన పోడు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి బంజర్‌లో రెండోసారి జరుగుతున్న రీ సర్వేను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు ఎండి.దావూద్, మండల కన్వీనర్ దుగ్గి చిరంజీవి, దాసరి కృష్ణ, చింతల రఘుపతి, పీరీల భాస్కర్, పాయం నారాయణ, మడే నాగమణి, బండ సారయ్య, కోరం శేఖర్, ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు.