Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్
- మునుగోడులో పొలిటికల్ హిట్
- సోషల్‌మీడియాలో మైండ్‌గేమ్
- కారెక్కిన దాసోజు, స్వామిగౌడ్
- కమలం నేతలు ఉక్కిరిబిక్కిరి
- కాంగ్రెస్‌లో వెంకట్‌రెడ్డి అలజడి
- గాంధీభవన్‌లో దిష్టిబొమ్మ దగ్ధం
- గోడలు దూకుతున్న నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'మునుగోడు' ముంచుకొస్తున్న నేపథ్యంలో రాజకీయా లు మరింత వేడెక్కుతున్నాయి. దీపావళి పండుగకు టాపాసులు పేల్చినట్టుగా నాయకులు మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శల మొతాదు పెంచుతూ రాజకీయ కాక పుట్టిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూనే...మరోవైపు పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపాయి. పొట్టోడిని పొడుగోడు కొడితే, పోడుగోడిని పోషవ్వ కొట్టిన చందంగా ఒక పార్టీ ఒకరిని చేర్చుకుంటే, మరొక పార్టీ ఇద్దరిని చేర్చుకుంటోంది. సాధారణ నాయకుడికి సైతం పెద్ద నాయకులు ఫోన్లు చేస్తున్నారు. తమ దూతలను పంపి రాయబేరాలు నడుపుతున్నారు. ఏదో తమ దారికి తెచ్చుకుని వలసలను ప్రోత్సహిస్తున్నాయి. బీజేపీ స్పీడ్‌కు కారు బ్రేకులు వేసింది. కమలాన్ని వీడి కారెక్కుతున్న పరిస్థితులు వచ్చాయి. కమలనాథుల ప్లాన్‌ను కారు చిత్తు చేస్తున్నది. అందులో భాగంగా బీజేపీ నేతలు దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ గులాబీ గూటికి చేరారు. రెండు, మూడు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే బుడిద బిక్షమయ్య కూడా కారెక్కి రరున పోయారు. ఆ రెండు పార్టీలు వలసలను ప్రోత్సహించడం లో పోటీ పడుతున్నాయి. మునుగోడులో ఆయా పార్టీలు స్థానిక నాయకులకు కండువాలు కప్పి పార్టీలో చేరినట్టుగా ప్రకటించుకుంటున్నాయి. తెల్లారేసరికి ఏ పార్టీలో ఎవరుం టారో అర్థం కావడం లేదు. కానీ రాష్ట్రస్థాయి నాయకులకు వల వేయడం ద్వారా ప్రజల మూడ్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో టీఆర్ఎస్ పైచేయి సాధిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీలు మైండ్‌గేమ్ ఆడు తున్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇటీవల మౌనంగా ఉంటున్నారు. ఆయన టీఆర్ఎస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సోషల్‌మీడియాలో వార్త వైరల్ అవుతున్నది. ఈ ప్రచారానానికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. హరీశ్‌రావు పేరు తెరపైకి తెచ్చింది. పండుగలు, ఫంక్షన్ల కలిసి ఫోటోలను సైతం బీజేపీ పోస్టులు పెడుతూ పలాన నేతలు తమ పార్టీలోకి వస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తు న్నాయి. కమలం కండువా కప్పుకుంటారంటూ వాట్సాఫ్ యూనివర్సిటీ మైండ్‌గేమ్ మొదలు పెట్టింది. ఈ నేపథ్యం లో కారు, కమలం దూషణల పర్వాన్ని ఎత్తుకున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మునుగోడు కుంపట్లు నడుస్తున్నాయి. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసింది. సొంత పార్టీ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి ఓటేయాలంటూ చెప్పిన వీడియో లీకైంది. అది రాజకీయాల్లో సంచనలం సృష్టిస్తున్నది. కాంగ్రెస్‌లో ఉంటూ శత్రుసేన అయిన బీజేపీతో వెంకట్‌రెడ్డి అంటకాగుతున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్‌లో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తాను సూచించిన అభ్యర్థిని గెలిపించేందుకు ఆయన వెళ్లకపోవడంతో అనేక విమర్శలు వస్తున్నాయి. మరోవైపు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తనను పదవి నుంచి దించేయాలని కుట్రలు చేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అనకొండల్లా మారి బుసలు కొడుతున్న బీజేపీకి ఎదురీదుతున్న సమయంలో పార్టీ నేతలు తనను ఇబ్బందికి గురి చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రం బీసీ అభ్యర్థి స్వల్ప మోజార్టీతో విజయం సాధిస్తారంటూ చెప్పి ఆ పార్టీలకు సవాల్ విసిరారు. అందులో భాగంగా 90శాతంగా ఉన్న బడుగు, బలహీనవర్గాలు ఏకతాటికి మీదకి రావాలంటూ కొన్ని పార్టీలు వాదిస్తున్నాయి. ఆ వాదంతో కొన్ని పార్టీలు పోటీలో నిలిచాయి. కానీ అక్కడ పోటీలో నిలబడని వైఎస్ఆర్టీపీ కూడా ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ ఆపార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. మరోవైపు బీజేపీని ఓడించే సామర్థ్యమున్న టీఆర్ఎస్కు సీపీఐ, సీపీఐ(ఎం) మద్దతు ప్రకటించాయి. కమలానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. మునుగోడులో బీజేపీని ఓడించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.